New Chief Justice of India: సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ తన వారసుడిగా జస్టిస్ యూయూ లలిత్ పేరును ప్ర‌క‌టించారు. నేడు త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయమూర్తి గా యుయు ల‌లిత్ పేరును కేంద్ర న్యాయ‌శాఖ  సిఫారసు చేశారు. ఆయ‌న గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం.. 

New Chief Justice of India: సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ తన వారసుడిగా జస్టిస్ యూయూ లలిత్ (Justice UU Lalit) పేరును ప్ర‌క‌టించారు. త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయమూర్తి గా యుయు ల‌లిత్ పేరును కేంద్ర న్యాయ‌శాఖ సిఫారసు చేశారు. ఈ మేర‌కు సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ ఇవాళ కేంద్ర న్యాయ‌శాఖకు లేఖ రాశారు. సిఫార‌సు పత్రాన్ని జ‌స్టిస్ ల‌లిత్‌కు సీజేఐ ర‌మ‌ణ అంద‌జేశారు. ప‌దవిలో ఉన్న‌ ప్ర‌ధాన న్యాయ‌మూర్తే.. త‌దుప‌రి ప్రధాన న్యాయమూర్తిని న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయ‌డం అన‌వాయితీగా వ‌స్తుంది. జస్టిస్ యుయు లలిత్ చాలా ప్ర‌ముఖ‌మైన‌ కేసులను వాదించారు. అనేక కీల‌క కేసులలో తీర్పు ఇచ్చాడు. 

కాగా ఈ నెల 26వ తేదీన సీజేఐ ఎన్వీ రమణ పదవీకాలం ముగియనుంది. ఈ తరుణంలో త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌ మూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ పేరును కేంద్ర‌ న్యాయ మంత్రిత్వ శాఖకు సీజేఐ ఎన్వీ రమణ సిఫార్సు చేశారు. ఈ మేర‌కు జస్టిస్‌ లలిత్‌ భారత 49వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఆయన పదవీకాలం నవంబర్‌ 8 వరకే ముగియ‌నున్న‌ది. ఆయ‌న‌ సీజేఐగా రెండున్నర నెలలే పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం యూయూ లలిత్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. 

ఇంత‌కీ Justice UU Lalit ఎవరు?

జస్టిస్ యుయు లలిత్ పూర్తి పేరు.. ఉదయ్ ఉమేష్ లలిత్. అతని తండ్రి యుఆర్ లలిత్. ఆయ‌న కూడా న్యాయమూర్తే.. ఆయ‌న‌ బాంబే హైకోర్టులో న్యాయ‌వాదిగా పనిచేశారు. యుయు లలిత్ 9 నవంబర్ 1957న మహారాష్ట్రలో జన్మించారు. తండ్రి న్యాయ‌మూర్తి కావ‌డంతో .. ల‌లిత్ కూడా న్యాయవాద విద్యను అభ్య‌సించారు. అనంత‌రం.. న్యాయవాదిగా.. త‌న జీవితాన్ని ప్రారంభించారు. 

తొలుత 1985 వరకు.. బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఆ త‌రువాత‌.. ఢిల్లీ కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ త‌రువాత ఆగస్టు 13, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు జ‌డ్జీగా పనిచేయకుండా నేరుగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇలా నియ‌మ‌కం అయినా వారిలో జస్టిస్ లలిత్ ఆరో వ్యక్తి . ఆయ‌న‌ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఆయ‌న అనేక కీల‌క తీర్పుల‌ను ఇచ్చారు. 

కీల‌క తీర్పులు 

ట్రిపుల్ తలాక్ కేసు: ఇప్పటివరకు జస్టిస్ యుయు లలిత్ తన పదవీకాలంలో అనేక ముఖ్యమైన నిర్ణయాలను అందించిన రాజ్యాంగ ధర్మాసనంలో భాగ‌స్వామిగా ఉన్నారు. పలు సంచ‌ల‌న తీర్పులను వెల్ల‌డించారు. ఇందులో ప్ర‌ధానంగా.. ఇన్‌స్టంట్ 'ట్రిపుల్ తలాక్' కేసు కూడా ఉంది. ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లో 3-2 మెజారిటీతో తీర్మానం చేశారు. ఇందులో జస్టిస్ లలిత్ ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. ఈ కీల‌క తీర్పుతో ముస్లిం మహిళలకు ఊరట లభించింది.

పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ కేసు: కేరళలోని చారిత్రాత్మక శ్రీపద్మనాభస్వామి ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయంపై కూడా జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం కీల‌క తీర్పును వెల్ల‌డించింది. శ్రీపద్మనాభస్వామి ఆలయ నిర్వహణ హక్కును అప్పటి ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి ఉంటుందని జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్ల‌డించింది. 

పోక్సో కేసు: జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాన్ని ఇచ్చింది. దీని ప్రకారం.. పిల్లల ప్ర‌యివేట్ భాగాలను తాకడం లేదా 'లైంగిక ఉద్దేశ్యం'తో శారీరక సంబంధం కలిగి ఉన్న చర్య POCSO చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం 'లైంగిక దాడి'గా పరిగణించబడుతుందని కీల‌క నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. 

అయోధ్య కేసు: అయోధ్యలోని రామమందిరం-బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించి అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ యుయు లలిత్ కూడా ఉన్నారు. అయితే ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ లలిత్ వైదొలగాలని, తాను కోరడం లేదని రాజీవ్ ధావన్ స్పష్టం చేశారు. అయితే జస్టిస్ లలిత్ స్వయంగా నిర్ణయం తీసుకుని కేసు నుంచి తప్పుకున్నారు.

కోర్టు పని వేళ‌ల్లో మార్పు: పిల్లలు 7 గంటలకు పాఠశాలకు వెళ్తుండ‌గా.. మ‌నం 9 గంటలకు కోర్టుకు ఎందుకు రాలేమ‌ని జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గత నెలలో సమావేశమైంది. సాధారణంగా 10:30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాన్ని జస్టిస్ లలిత్ 9:30 గంటలకు పిలిచారు. “మా పిల్లలు ఉదయం 7 గంటలకు పాఠశాలకు వెళ్లారు. మ‌నం ఉదయం 9 గంటల నుండి ఎందుకు పని చేయలేము? నేను ఎల్లప్పుడూ ఉదయం 9 గంటలకు పని ప్రారంభించి, 11 గంటలకు కాఫీ తాగిన తర్వాత 2 గంటల వరకు పని చేయడానికి ఇష్టపడతానని చెప్పుకోచ్చారు. కోర్టు స‌మయాల‌ను మార్చ‌డంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. 

సల్మాన్‌ఖాన్‌, అమిత్‌ షాకు వకాల్తా!

కృష్ణజింకలను వేటాడిన కేసులో నటుడు సల్మాన్ ఖాన్ తరపున జస్టిస్ యుయు లలిత్ వాదించారు. అవినీతి కేసులో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తరపున కూడా ఆయన వాదించారు.ప్ర‌ధాన న్యాయమూర్తిగా ఆయ‌న ఎలాంటి తీర్పులు వెల్ల‌డిస్తాడో వేచిచూడాలి.