Asianet News TeluguAsianet News Telugu

Republic Day: గణతంత్ర వేడుకలో శకటాల వివాదంపై నేతాజీ కూతురు ఆగ్రహం

గణతంత్ర వేడుకల్లో శకటాల ఎంపిక విషయంలో కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ థీమ్‌తో ఏర్పాటు చేసిన పశ్చిమ బెంగాల్ శకటాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయకపోవడంపై సీఎం మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. పీఎం మోడీకి లేఖ కూడా రాశారు. తాజాగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూతురు అనితా బోస్ పాఫ్ స్పందించారు. ఈ శకటాల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
 

netaji daughter slams on republic day tableau controversy
Author
New Delhi, First Published Jan 17, 2022, 8:32 PM IST

న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీన గణతంత్ర వేడుక(Republic Day Celebrations)లు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి మధ్య శకటాల(tableau) విషయమై వివాదం రగులుకుంది. తాము పంపిన శకటాలను ఎంపిక చేయలేదని కొన్ని రాష్ట్రాలు గుర్రుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తమ సంస్కృతిని, ఉన్నతిని ప్రకటించే శకటాలను ఎంపిక చేయకపోవడం తమ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని దెబ్బతీయడమే అనే స్థాయికి వివాదాన్ని తీసుకెళ్లాయి. తాజాగా, ఇదే వివాదంపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూతురు అనితా బోస్ పాఫ్ స్పందించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్(Netaji Subhash Chandrabose) థీమ్‌తో పంపిన పవ్చిమ బెంగాల్(West Bengal) శకటాన్ని కేంద్రం ఎంపిక చేయలేదు. ఈ విషయంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee)ఇది వరకే ప్రధాని మోడీకి లేఖ రాశారు.

ఔను నేను.. విన్నాను. ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ శకటాన్ని ఎంపిక చేయలేదో తెలియదు అని బోస్ కూతురు అనితా పాఫ్ పేర్కొన్నారు. అయితే, అందుకు కొన్ని కారణాలు ఉండొచ్చని తెలిపారు. తన తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఏడాదే గణతంత్ర దినోత్స వేడుకల్లో తన తండ్రి శకటం లేకపోవడాన్ని ఊహించలేకపోతున్నానని వివరించారు. ఇది చాలా వింతగా అనిపిస్తున్నదని తెలిపారు. జర్మనీ నుంచి ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

గతేడాది తన తండ్రి జయంతి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారని, కోల్‌కతా మొత్తం వేడుకలు నిర్వహించారని ఆమె పేర్కొన్నారు. అప్పుడ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, వాటితో ఆ వేడుకలకు సంబంధం ఉండవచ్చునేమో అని తెలిపారు. కానీ, గతేడాది కంటే ఈ ఏడాది అంత ఘనమైన ఏర్పాట్లు లేవని, తన తండ్రి జయంతి ఈ ఏడాది కంటే గతేడాదే ఎక్కువ ముఖ్యమై ఉండవచ్చని విమర్శలు చేశారు. అందులో పాక్షికంగానైనా రాజకీయ కారణాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కానీ, ఈ విషయాలను తాను ఖండించాలని భావించడం లేదని, ఎందుకంటే దీనిపై ఇప్పుడు ప్రజలు అందరూ చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. చాలా మంది ప్రజల మనస్సులను తాకే కార్యక్రమం కాబట్టి.. వారు చర్చించడంలో ఆశ్చర్యం లేదని వివరించారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన కొన్ని రహస్య పత్రాలను వెల్లడించిన కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె ప్రశంసించిన సంగతి తెలిసిందే. కానీ, అయితే, ఆయన జయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహించడానికి ప్రణాళికల కోసం ఏర్పాటు చేసిన కమిటీ కూర్పుపై మండిపడ్డారు. అందులో తనను చేర్చాల్సిందని అభిప్రాయపడ్డారు. తనను కనీసం సంప్రదించనూ లేదని వివరించారు. అసలు నాకు తెలిసి ఆ కమిటీ ఒక్కసారి కూడా సమావేశమవలేదని పేర్కొన్నారు. తన దృష్టిలో ఆ కమిటీ లేనట్టేనని తెలిపారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలు(Republic day Celebrations) జనవరి 23వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. గత ఏడాది వరకు గణతంత్ర వేడుకలు జనవరి 24వ తేదీ నుంచి ప్రారంభం అయ్యేవి. కానీ, ఈ ఏడాది మొదలు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి(Netaji Subhash Chandrabose Birth Anniversary) అంటే జనవరి 23వ తేదీ నుంచే ప్రారంభం కానున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. భారత దేశ చరిత్ర, సంస్కృతికి సంబంధించి ప్రధానమైన అంశాలను వేడుక చేసుకోవాలనే నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ దివస్‌గా వేడుక చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios