న్యూఢిల్లీ: ఐఐటీ జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని దాఖలు చేసిన ఆరు రాష్ట్రాల రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారంనాడు కొట్టివేసింది.

కరోనా నేపథ్యంలో ఐఐటీ జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ బీజేపీయేతర రాష్ట్రాలకు చెందిన ఆరు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో ఈ ఏడాది ఆగష్టు 28వ తేదీన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఇటీవల బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోనియాగాంధీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐఐటీ జేఈఈ., నీట్ పరీక్షల విషయమై చర్చించారు.ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో ఐఐటీ జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం షెడ్యూల్ విడుదల చేసింది.

ఐఐటీ జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ఆగష్టు 17వ తేదీన సుప్రీంకోర్టు కొట్టివేసింది. పరీక్షలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగానే నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

ఈ తీర్పుపై ఆరు రాష్ట్రాలు ఆగష్టు 28వ తేదీన సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలు ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రాష్ట్రాల తరపున  న్యాయవాది సునీల్ ఫెర్నాండెస్ పిటిషన్ దాఖలు చేశారు.

also read:ఐఐటీ-జేఈఈ, నీట్ పరీక్షల వాయిదాకు సుప్రీంలో పిటిషన్

కరోనా నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని ఈ రాష్ట్రాలు ఈ పిటిషన్ లో పేర్కొన్నాయి.ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13వ తేదీన నీట్ పరీక్షలను నిర్వహించాలని  కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా  161 పరీక్షా కేంద్రాల్లో  పరీక్షలను నిర్వహించనుంది.