ఎన్డీయే అంటే ‘‘ న్యూ ఇండియా, డెవలప్‌మెంట్, ఆస్పిరేషన్ ’’.. ఈసారి 50 శాతంపైనే ఓట్లు : మోడీ
ఈ సారి ఎన్డీయే కూటమి 50 శాతానికి పైగా ఓట్ షేర్ సాధిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మా మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా బలపడుతున్నాయని మోడీ చెప్పారు. ఎన్డీయే కెమిస్ట్రీ, హిస్టరీ ప్రజలకు బాగా తెలుసునని అన్నారు.

ఎన్డీయే ఏర్పాటులో వాజ్‌పేయి, అద్వానిలు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీలోని అశోకా హోటల్‌లో మంగళవారం జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయేలో చేరిన కొత్త పార్టీలకు స్వాగతం పలికారు. అభివృద్ధి దిశగా దేశం ముందుకు సాగుతోందని.. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవిస్తున్నామని మోడీ పేర్కొన్నారు. 25 ఏళ్ల నుంచి ఎన్డీయే దేశ సేవలో వుందని.. ఎన్డీయే అంటే ‘‘న్యూ ఇండియా డెవలప్‌మెంట్ ఆస్పిరేషన్’’గా ప్రధాని అభివర్ణించారు. ఒకరికి వ్యతిరేకంగా తాము తయారవ్వలేదని.. ఒకరి నుంచి అధికారాన్ని లాక్కోవడానికి ఎన్డీయే ఏర్పడలేదని మోడీ స్పష్టం చేశారు.
ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రజా తీర్పును ఎప్పుడూ ప్రశ్నించలేదని ప్రధాని వెల్లడించారు. వ్యతిరేక భావజాలంతో ఏర్పడిన కూటమి ఎప్పటికీ విజయం సాధించదని.. ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టే హరివిల్లు ఎన్డీయే అని మోడీ వ్యాఖ్యానించారు. దేశ భద్రతే ఎన్డీయే ప్రథమ ప్రాధాన్యమని.. తాము ప్రతిపక్షంలో వుండగా విదేశీ శక్తుల జోక్యాన్ని అంగీకరించలేదని ఆయన గుర్తుచేశారు. ఎన్డీయేలో ఏది పెద్ద పార్టీ కాదు.. ఏదీ చిన్న పార్టీ కాదని ప్రధాని స్పష్టం చేశారు. అవినీతిపై ఏర్పడ్డ కూటమి విజయవంతం కాలేదని మోడీ విపక్షాలకు చురకలంటించారు. మనమంతా ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నామన్నారు.
గత ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చిందని.. అయినా తాము ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని నరేంద్ర మోడీ గుర్తుచేశారు. పేదల అభ్యున్నతికి ఎన్డీయే పనిచేస్తుందని.. గాంధీజీ, అంబేద్కర్ విధానాలనే పాటిస్తుంది, అమలు చేస్తుందని ప్రధాని తెలిపారు. ప్రజల్లో పనిచేసే పార్టీలే ఎన్డీయే కూటమిలో వున్నాయని.. డిఫెన్స్ నుంచి మైనింగ్ వరకు మహిళలకు అవకాశం ఇచ్చామని మోడీ పేర్కొన్నారు. ముద్ర, స్టార్టప్ ఇండియా లాంటి పథకాలతో గ్రామీణ పేద మహిళల జీవితాలు మారాయన్నారు.
భవిష్యత్ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నామని.. దేశంలో ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా వున్నారని మోడీ తెలిపారు. మేకిన్ ఇండియాను అమలు చేస్తూనే, పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధాని చెప్పారు. అవినీతిని కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడ్డాయని.. గత 9 ఏళ్లలో అవినీతికి అవకాశం వున్న అన్ని మార్గాలను తగ్గిస్తూ వచ్చామని మోడీ తెలిపారు. జీవితాంతం కాంగ్రెస్‌లో వున్న ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇచ్చి గౌరవించామని, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్, తరుణ్ గొగోయ్ వంటి నేతలకు పద్మ అవార్డులు ఇచ్చామని ప్రధాని గుర్తుచేశారు. అంతే తప్పించి తాము రాజకీయాలు చేయదలచుకోలేదన్నారు.
కరోనా సమయంలో పార్టీలకు అతీతంగా అందరికీ సాయం అందించామని నరేంద్ర మోడీ అన్నారు. భాష ప్రజల మధ్య విభేదాలకు ఆయుధంగా మారిందని.. కానీ తాముమాతృభాషకు ప్రాధాన్యమిచ్చామని ఆయన వెల్లడించారు. సామాన్యులను విపక్ష పార్టీలు తక్కువగా అంచనా వేస్తున్నాయని.. విపక్షాలు ఎందుకు ఏకమవుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారని మోడీ దుయ్యబట్టారు. చిన్న చిన్న స్వార్ధాలతో సిద్ధాంతాలను పక్కనపెట్టి ఒక్కటవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బెంగాల్‌లో టీఎంసీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య ఎప్పుడూ గొడవలేనని.. కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు రోజూ తిట్టుకుంటాయని మోడీ దుయ్యబట్టారు. వీళ్లంతా ఒక్క దగ్గరకు చేరుతారేమో గానీ, ముందుకు చేరలేరని ప్రధాని జోస్యం చెప్పారు. నన్ను తిట్టేందుకు కేటాయించే సమయాన్ని దేశ ప్రజల కోసం కేటాయిస్తే బాగుండేదన్నారు. గత ఎన్నికలలో మాకు 45 శాతం ఓట్లు వచ్చాయని.. 250 చోట్ల మాకు 50 శాతానికిపైగా ఓట్లు వచ్చాయని ప్రధాని తెలిపారు. ఎన్డీయే కెమిస్ట్రీ, హిస్టరీ ప్రజలకు బాగా తెలుసునని నరేంద్ర మోడీ అన్నారు.
ఎన్నికల ఏడాడిలో విదేశాలు సైతం రాజకీయాలను బాగా గమనిస్తాయని.. అధికారం కోల్పోయే పార్టీలతో ఆచితూచి వ్యవహరిస్తాయని ప్రధాని చెప్పారు. అయితే ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలు మాత్రం భారతదేశంతో సంబంధాలు మెరుగుపరచుకుంటున్నాయన్నారు. అంటే ప్రజలు మళ్లీ ఎన్డీయేను కోరుకుంటారని విదేశాలకు కూడా తెలుసునని నరేంద్ర మోడీ తెలిపారు. ఈసారి కూడా అలాంటి ఓట్ షేర్‌ను సాధిస్తామని.. మా మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా బలపడుతున్నాయని మోడీ చెప్పారు.
తాము నిజాయితీగా పనిచేస్తాం, అదే మా గ్యారెంటీ అని.. తన శరీరంలో ప్రతికణం, నా సమయంలో ప్రతిక్షణం దేశం కోసమేనని ప్రధాని స్పష్టం చేశారు. దేశాభివృద్ధే మా ఏకైక లక్ష్యం, అజెండా అని .. దేశం కోసం పనిచేయడంలో ఎప్పుడూ వెనకడుగు వేయమని ఆయన పేర్కొన్నారు. ఎన్డీయే హయాంలోనే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించబోతోందని నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు.