రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థిని ఎన్డీఏ నేడు ఖరారు చేయనున్నట్లు సమాచారం. మంగళవారం పార్లమెంటరీ బోర్డు భేటీ అనంతరం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఢిల్లీ : త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై NDA ముమ్మర కసరత్తు చేస్తోంది. ఎన్డీఏ presidential candidate పేరును మంగళవారం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నేడు సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలోనే రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠకు తెరదించే అవకాశం ఉంది. నేడు యోగా దినోత్సవం దృష్ట్యా మైసూర్ లో జరగనున్న కార్యక్రమంలో ప్రధాని Modi పాల్గొననున్నారు. ప్రధాని మైసూర్ నుంచి వచ్చాక పార్లమెంటరీ బోర్డు భేటీ జరగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఐదు రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదలైంది.

అయితే ఇప్పటివరకు అధికార, ప్రతిపక్ష కూటముల నుంచి రాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారు కాలేదు. అధికారపక్షం తర్వాతే విపక్షాలు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం బిజెపి కమిటీ వేసింది. జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు అయింది. అయితే విపక్షాలతో చర్చించి ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని ఈ కమిటీ బిజెపి అధిష్టానానికి సూచించింది. దీంతో పలువురు ప్రతిపక్ష నేతలతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంప్రదింపులు జరిపారు. మరోవైపు అభ్యర్థుల ఎంపిక కోసం మంగళవారం సాయంత్రం విపక్ష పార్టీ నేతలు భేటీ కానున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 29 చివరి తేదీ.

ప్రతిపక్షాలకు మరో దెబ్బ.. రాష్ట్రపతి అభ్యర్థి రేసు నుంచి తప్పుకున్న ఫరూఖ్ అబ్దుల్లా

కాగా, జూన్ 16న రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. ఆర్థిక వ్యవస్థ బాగోలేదని ప్రధాని మోదీ, అమిత్ షాలకు స్పష్టంగా చెప్పానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ వెల్లడించారు. నేడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఎకానమీ సమ్మిట్ పెట్టాలని కోరానని తెలిపారు. బిజెపి అభ్యర్థే రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలుస్తారన్నారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ప్రతిపక్షాలు ఐక్యం కావాలని.. ప్రతిపక్షాలు వేరువేరు కూటములుగా ఉండద్దని పాల్ సూచించారు. ఆయన మాట్లాడుతూ…‘నేను ఓడిపోయే వారి పక్షాన ఉండను. ప్రతిపక్షాల్లో ఐక్యత లేదు. ప్రతిపాదించిన వారు కూడా రాష్ట్రపతి అభ్యర్థులుగా ఉండటానికి ఇష్టపడటం లేదు. బిజెపి అభ్యర్థి 60 శాతం ఓట్లతో గెలుస్తారు. 

నేను రాష్ట్రపతి అభ్యర్థి కాదు. బిజెపి, కాంగ్రెస్ ల వల్ల దేశం నాశనం అయిపోతుంది. దేశ అభివృద్ధిపై రాజకీయ పక్షాలు దృష్టి సారించాలి. ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోవడం వల్లే బిజెపి బలంగా ఉంది. మంచి తటస్థ అభ్యర్థిని ఎన్డీఏకు ప్రతిపాదించాను. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మోడీ, అమిత్ షా, పురుషోత్తం రూపాలకు తెలిపాను. నాతో 18 పార్టీలు సేవ్ సెక్యులర్ ఇండియా కూటమిలో ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో నాలుగు కూటములుగా ఉన్నాయి. కేసీఆర్ తో సేవ్ సెక్యులర్ ఇండియా రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించాను. కెసిఆర్ కి వచ్చే ఎన్నికల్లో ఎంపీలు ఉండరు’ అని పేర్కొన్నారు.