Asianet News TeluguAsianet News Telugu

తొలిసారి క‌రెంటు వెలుగులు చూడ‌నున్న ముర్ము స్వ‌గ్రామం.. యుద్ధ‌ ప్రాతిపాదిక‌న ప్రారంభ‌మైన ప‌నులు

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము స్వగ్రామం త్వరలోనే మొదటి సారిగా కరెంటు వెలుగులను చూడనుంది. తమ గ్రామానికి కరెంటు సౌకర్యం కల్పించాలని ఆ గ్రామస్తులు ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నిసార్లు విన్నవించినా పనులు జరగలేదు. అయితే ఇప్పుడు యుద్ద ప్రాతిపాదికన పనులు ప్రారంభం అయ్యాయి. మరో వారం రోజుల్లో ఆ గ్రామానికి కరెంటు చేరుకోనుంది. 

NDA presidential candidate Draupadi Murmu's village to get electricity soon ..
Author
New Delhi, First Published Jun 26, 2022, 4:16 PM IST

NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గ్రామస్థులు కరెంటు లేక చీకట్లో మగ్గుతున్న దుస్థితిని మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో ఒడిశా ప్రభుత్వం ఆమె గ్రామమైన మయూర్‌భంజ్ జిల్లా కుసుమ్ బ్లాక్ పరిధిలోని ఉపర్బెడ గ్రామం కోసం విద్యుద్దీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది. అయితే  ఆమె ఇప్పుడు ఆ గ్రామంలో నివ‌సించ‌డం లేదు. తన స్వగ్రామానికి 20 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న మునిసిపల్ పట్టణం రాయంగ్‌పూర్‌లో ఉంటున్నారు. 

మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయం: కోర్టుకు వెళ్లే యోచనలో ఏక్‌నాథ్ షిండే వర్గం

కాబోయే రాష్ట్ర‌ప‌తిగా భావిస్తున్న ముర్ము స్వ‌గ్రామానికి క‌రెంటు లేద‌నే విష‌యంపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగింది. దీంతో ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించింది. టాటా పవర్ నార్త్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (TPNODL) అధికారులు, కార్మికుల బృందం ముప్పై ఎనిమిది విద్యుత్ స్తంభాలు, 900 మీటర్ల కేబుల్‌లు, కండక్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లను, అలాగే జేసీబీల‌ను తీసుకొని శ‌నివారం ఉప‌ర్బెడ గ్రామానికి చేరుకుంది. విద్యుదీకరణ పనులను పూర్తి చేసి 24 గంటల్లో మొత్తం ఉప్ప‌ర్ బెడ గ్రామానికి విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని కంపెనీలోని మయూర్‌భంజ్ విభాగానికి ఆదేశాలు జారీ చేసినట్లు టీపీఎన్‌ఓడీఎల్ (TPNODL) సీనియర్ అధికారి వార్తా సంస్థ PTIతో తెలిపారు. అయితే వచ్చే వారంలో విద్యుద్దీకరణ పనులు పూర్తవుతాయని డిస్కమ్‌ టీపీఎన్‌ఓడీఎల్‌ సీఈవో భాస్కర్‌ సర్కార్‌ తెలిపారు. 

Mann Ki Baat : ప్ర‌జాస్వామ్య మార్గాల ద్వారా భార‌తీయులు ఎమ‌ర్జెన్సీని ఓడించారు - ప్ర‌ధాని నరేంద్ర మోడీ

సుమారు 3,500 జనాభా కలిగిన ఉపర్బెడ గ్రామంలో రెండు కుగ్రామాలు ఉన్నాయి. అవి బాదాసాహి, దుంగ్రిసాహి. ఈ గ్రామాల‌కు మ‌ధ్య ఒక కిలో మీట‌ర్ దూర‌మే ఉన్న‌ప్ప‌టికీ ద్రౌపది మేనల్లుడు బిరంచి నారాయణ్ తుడుతో పాటు మ‌రో 20 కుటుంబాలు నివసించే దుంగ్రిసాహికి ఇంకా విద్యుత్ సౌకర్యం లేదు. బాదాసాహిలో ఉంది. ముర్ము మేనల్లుడు బిరంచి నారాయణ్ తుడు తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆ కుగ్రామంలోనే నివసిస్తున్నాడు. 

అయితే దుంగూర్‌సాహిలో ఇళ్లు అటవీ భూమిలో నిర్మించినందున విద్యుత్‌ సౌకర్యం కల్పించలేదని ఓ అధికారి తెలిపారు. ‘‘ గ్రామస్తులను చీకటిలో ఉంచాలనే ఉద్దేశ్యం మాకు లేదు. కానీ నిర్దిష్టంగా అధికారిక ఉత్త‌ర్వులు లేక‌పోవ‌డం వ‌ల్ల క‌రెంటు సౌక‌ర్యం ఇవ్వ‌లేదు ’’ అని చెప్పారు. “ మా దుంగూర్‌సాహి కుగ్రామానికి విద్యుత్‌ను అందించాలని మేము చాలా మందిని అభ్యర్థించాము. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు” అని బిరంచి భార్య ఆరోపించారు. అయితే ప‌లు పండుగ‌ల స‌మ‌యంలో ద్రౌప‌ది ముర్ము  ఆ గ్రామానికి వ‌చ్చిన‌ప్పటికీ.. ఈ స‌మ‌స్యను ఆమె వ‌ద్ద ప్ర‌స్త‌వించ‌లేదు. 

లిక్కర్‌ డబ్బుల కోసం గొడవ.. నానమ్మ, తాతను చంపేసిన మనవడు

“ ప్రజలు తమ ఇళ్లలో వెలుగు కోసం కిరోసిన్ దీపాలను ఉపయోగిస్తారు. 2019 ఎన్నికల సమయంలో మేము ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ దృష్టికి తీసుకెళ్లాం. కానీ ఎలాంటి ఉప‌యోగమూ లేకుండా పోయింది. ” అని ఉపర్బెడ గ్రామానికి చెందిన మ‌రో వ్య‌క్తి చిత్తరంజన్ బస్కే అన్నారు. కాగా త‌మ గ్రామం నుంచి ఒక‌రు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో అడుగుపెట్ట‌బోతున్నార‌ని ఆ గ్రామ‌స్తులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే మాజీ ఎంపీలు సల్ఖాన్ ముర్ము, భబేంద్ర మాఝీ, మాజీ మంత్రి కార్తీక్ మాఝీ కూడా ఉపర్‌బెడ గ్రామానికి చెందిన వారేన‌ని పీటీఐ తెలిపింది. అధికారిక లెక్కల ప్ర‌కారం మయూర్‌భంజ్ జిల్లాలో దాదాపు 500 గ్రామాలకు ర‌హదారులు లేవు. అలాగే 1350 గ్రామాలకు ఇప్ప‌టికీ విద్యుత్ సౌకర్యం లేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios