లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విపక్షాలన్నీ ఏకతాటిమీదికి వచ్చి ఎన్డీయేను ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. రేపటి నుంచి ప్రారంభమై రెండు రోజులపాటు బెంగళూరులో జరగనున్న విపక్షాల సమావేశంలో 26 పార్టీల ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. కాగా, ఎల్లుండి ఎన్డీయే కూటమి కూడా మిత్ర పార్టీలతో సమావేశం కాబోతున్నది. ఇందులో 29 పార్టీల ప్రతినిధులు అటెండ్ అవుతారు. 

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. అధికారంలోని ఎన్డీయేను దింపేయాలని ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాల నుంచే విపక్ష కూటమి కోసం అడుగులు పడుతున్నాయి. గత నెల పట్నాలో 15 ప్రతిపక్ష పార్టీలు సమావేశం అయ్యాయి. మళ్లీ రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు బెంగళూరులో విపక్ష ఐక్య కూటమి పార్టీల మేదోమధనం జరగనుంది.

ఇదిలా ఉండగా.. వరుసగా మూడోసారి అధికారాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఎన్డీయే కూడా రేపు మిత్రపక్షాలతో భేటీ అవుతున్నది. బీజేపీ రెండో టర్మ్‌లో ఎన్డీయే పార్టీల సమావేశం కావడం ఇదే తొలిసారి. గత లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన సీట్లు కొన్ని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కోల్పోయినా.. ఇతర సీట్లను గెలుచుకోవాలని, మిత్ర పక్షాల మద్దతుతోనూ సంఖ్యా బలం పెంచుకుని పార్లమెంటులో మెజార్టీ స్థానాలను నిలుపుకోవాలకి ఎన్డీయే భావిస్తున్నది. ఇందులో భాగంగానే మిత్ర పార్టీలతో ఓ భేటీకి ప్లాన్ చేసింది.

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాల ఏకతాటి మీదికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్న విపక్షాలు, అధికారాన్ని కాపాడుకోవడానికి బీజేపీ వ్యూహంలో భాగంగా నిర్వహిస్తున్న సమావేశాలు రెండూ ఒకేసారి జరుగనుండటంతో లోక్ సభ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైందా అన్నట్టుగా మారింది. ఒకరకంగా ఈ భేటీలు పార్టీల బలాబలాలనూ ప్రదర్శిస్తున్నట్టుగానూ కనిపిస్తున్నది. ఈ సందర్భంలోనే ఈ రెండు సమావేశాల్లో హాజరు కాబోతున్న.. ఏ పార్టీ ఏ జట్టు అనే విషయాలనూ తెలుసుకుందాం.

ముందుగా అధికార ఎన్డీయే కూటమి సమావేశంలో మొత్తం 29 పార్టీల నుంచి నేతలు హాజరు కాబోతున్నట్టు తెలిసింది. ఇప్పటికి ఎన్డీయేతో 24 పార్టీలు ఉన్నాయి. మరో ఐదు పార్టీలు ఈ నెల 18న జరగనున్న ఎన్డీయే భేటీలో పాల్గొనబోతున్నాయి. 

ప్రస్తుతం ఎన్డీయేలో ఉన్న పార్టీల జాబితా ఇలా ఉన్నది. 1. బీజేపీ, 2. ఏఐఏడీఎంకే, 3. శివసేన (షిండే వర్గం), 4. ఎన్‌పీపీ (నేషనల్ పీపుల్స్ పార్టీ మేఘాలయ), 5. ఎన్‌డీపీపీ (నేషనల్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ), 6. ఎస్‌కేఎం (సిక్కిం క్రాంతికారి మోర్చా), 7.జేజేపీ, 8. ఐఎంకేఎంకే (ఇండియా మక్కల్ కల్వి మున్నేట్ర కజగం), 9. ఏజేఎస్‌యూ (ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్), 10. ఆర్‌పీఐ, 11. ఎంఎన్ఎఫ్ (మిజో నేషనల్ ఫ్రంట్), 12. తమిళ మనీలా కాంగ్రెస్, 13. ఐటీఎఫ్‌టీ, 14. బీపీపీ(బోడో పీపుల్స్ పార్టీ), 15. పీఎంకే (పాటిల్ మక్కల్ కచ్చి), 16. ఎంజీపీ (మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ), 17. అప్నా దళ్ (సోనెలాల్), 18. ఏజీపీ, 19. రాష్ట్రీయ లోక్ జన్ శక్తి పార్టీ (పరాస్), 20. నిషాద్ పార్టీ, 21. యూపీపీఎల్ (యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ అస్సాం), 22. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పుదుచ్చేరి, 2. శిరోమణి అకాలీ దళ్ సంయుక్త (దిండా), 24. జనసేనలు ప్రస్తుతం ఎన్డీయేలో ఉన్నాయి. కాగా, కొత్తగా మరో ఐదు పార్టీలు చేరాయి. అవి ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం), 2. ఎల్జేపీ (రామ్ విలాస్ పాశ్వాన్), 3. హిందుస్తాన ఆవామ్ మోర్చా జితన్, 4. ఆర్ఎల్‌ఎస్పీ, 5. ఎస్బీఎస్పీలు.

Also Read: ఢిల్లీ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించిన కాంగ్రెస్.. ఆప్ పోరాటానికి మద్దతు.. విపక్ష భేటీకి కేజ్రీవాల్ హాజరు?

ఇక ప్రతిపక్ష కూటమికి జరుగుతున్న ప్రయత్నాల్లో పాలుపంచుకుంటున్న పార్టీల సంఖ్య 26. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. పట్నా సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్నాయి. ఆర్ఎల్‌డీ నేత రాలేకపోయారు. ఆ తర్వాత ఇటీవలే ఎనిమిది పార్టీలు చేరాయి. తాజాగా, మరో రెండు పార్టీలు క్రిష్ణ పటేల్ సారథ్యంలోని అప్నా దళ్ (కే), తమిళనాడుకు చెందిన మనితనేయ మక్కల్ కచ్చిలు బెంగళూరులోని విపక్షాల సమావేశానికి హాజరవుతాయి.

పట్నాలో జేడీయూ, కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీ, ఆప్, సీపీఎం, సీపీఐ, సీపీఎంఎల్(ఎల్), సమాజ్‌వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, శివసేన (ఉద్ధవ్), జేఎంఎంలు పాల్గొన్నాయి. ఆర్ఎల్‌డీ నుంచి ప్రతినిధి దీనికి హాజరు కాలేకపోయారు. ఆ తర్వాత ఎనిమిది పార్టీలు ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి), ఎండీఎంకే, కేడీఎంకే, వీసీకే, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్‌పీలు ఈ కూటమిలోకి వచ్చాయి. ఆ తర్వాత రెండు పార్టీలు కూడా చేరుతుండటంతో బెంగళూరులో నిర్వహిస్తున్న ప్రతిపక్షాల సమావేశానికి మొత్తం 26 పార్టీల ప్రతినిధులు రాబోతున్నట్టు తెలుస్తున్నది.

ఈ సమావేశానికి సోనియా గాంధీ కూడా హాజరు కావడంతో విభేదాలు చాలా వరకు మెత్తబడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వీలైనంత వరకు ముందుకు వెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతాయని తెలుస్తున్నది. ఈ సమావేశానికి ఒక్క రోజు ముందే కాంగ్రెస్ ఢిల్లీ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఆప్‌ను తన దారి తిప్పుకుంది.