వరకట్న వేధింపులతో పలువురు మహిళలు బలవుతూనే ఉన్నారు. అయితే వరకట్నంతో లాభాలు, ప్రయోజనాల జాబితాతో కూడిన పుస్తకాన్ని కొన్ని కాలేజ్‌ల్లో నర్సింగ్ విద్యార్థులకు బోధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  

దేశంలో ఇప్పటికీ కట్నం పేరుతో వేధింపులు నిత్యం ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి. ఈ వేధింపులతో పలువురు మహిళలు బలవుతూనే ఉన్నారు. అయితే వరకట్నంతో లాభాలు, ప్రయోజనాల జాబితాతో కూడిన పుస్తకాన్ని కొన్ని కాలేజ్‌ల్లో నర్సింగ్ విద్యార్థులకు బోధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఆ పుస్తకంపై పరిష్కార చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ మంగళవారం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరింది.

ఈ విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఎన్‌సీడబ్ల్యూ ఒక ప్రకటనలో తెలిపింది. తాము దీనిని పరిగణలోకి తీసుకున్నట్టుగా పేర్కొంది. ఇది వరకట్నంకు సంబంధించి ప్రబలమైన ముప్పు గురించి విద్యార్థులకు చాలా తప్పుడు సందేశాన్ని పంపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ Rekha Sharma.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. పరిష్కార చర్యలు తీసుకోవాల్సిందిగా లేఖలో కోరారు. 

ఇదే అంశానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్‌కు కూడా రేఖా శర్మ లేఖ రాశారు. ఈ విషయంలో చర్యను ప్రారంభించాలని.. వారం రోజుల్లోగా ఎన్‌సీడబ్ల్యూకు తెలియజేయాలని లేఖలో పేర్కొన్నారు. 

టీకే ఇంద్రాణి.. Textbook of Sociology for Nurses పుస్తకాన్ని రాశారు. దీనికి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సిలబస్ ప్రకారం రాసినట్టుగా కవర్ పేజీపై రాసి ఉంది. అయితే ఆ పుస్తకంలో ఓ చోట వరకట్నంతో ప్రయోజనాలు ఉన్నాయని ప్రస్తావించారు. ఆడపిల్లలు వారి పుట్టింటి ఆస్తిలో ఇలా కట్నం రూపంలో పొందుతారు. వరకట్నం వల్లే అమ్మాయిలను చదివించడం కూడా ఈ మధ్య పెరిగింది. అమ్మాయి ఉద్యోగం చేస్తే కట్నం డిమాండ్ తగ్గుతుంది. కాస్త అందం తక్కువగా ఉన్న అమ్మాయిలకు కూడా పెళ్లిల్లు అవుతాయి’ అని ప్రస్తావించారు.