Navy helicopter crash : కొచ్చి ఎయిర్ స్టేషన్ లో కూలిన నేవీ హెలికాప్టర్.. ఒకరు మృతి ?
Chetak helicopter crash : కేరళలోని కొచ్చిలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఇండియన్ నేవికి చెందిన చేతక్ హెలికాప్టర్ కొచ్చిలోని నావికాదళ వైమానిక కేంద్రం ఐఎన్ఎస్ గరుడ రన్ వే పై కుప్పకూలింది.
Navy helicopter crash : కేరళ రాష్ట్రం కొచ్చిలోని నావికాదళ వైమానిక కేంద్రం ఐఎన్ఎస్ గరుడ రన్ వే (INS Garuda runway) వద్ద చేతక్ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. శిక్షణలో ఉన్న భారత నౌకాదళ హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిందని ‘పీటీఐ’ వెల్లడించింది. రొటీన్ ట్రైనింగ్ డ్రిల్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ ప్రమాదంలో నేవీ అధికారి ఒకరు మరణించినట్లు తెలుస్తోంది. రన్ వేపై ఉన్న నౌకాదళ అధికారి హెలికాప్టర్ రోటార్ బ్లేడ్లను ఢీకొనడంతో మృతి చెందినట్లు ‘మనోరమ న్యూస్’ తెలిపింది. దీనిపై భారత నౌకాదళం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కొచ్చిలోని నేవీ ప్రధాన కార్యాలయంలోని ఐఎన్ఎస్ గరుడ రన్వేపై ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పైలట్ సహా ఇద్దరికి గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోందని ‘మనోరమ న్యూస్’ తెలిపింది. వారు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సాధారణ శిక్షణ సమయంలో చేతక్ హెలికాప్టర్ కూలిపోయిందని తెలుస్తోంది.
ఐఎన్ఎస్ గరుడ ఐఎన్ఎస్ వెందుర్తికి ఆనుకుని దక్షిణ నౌకాదళ ప్రధాన కార్యాలయం ఉంది. ఐఎన్ఎస్ గరుడ ఒక ప్రధాన నౌకాదళ వైమానిక శిక్షణా కేంద్రం, కార్యాచరణ స్థావరంగా సేవలు అందిస్తోంది. ఐఎన్ఎస్ గరుడలో రెండు ఇంటర్సెక్టింగ్ రన్ వేలు ఉన్నాయి. దీనిపై దాదాపు అన్ని ఆపరేషనల్ విమానాలు ల్యాండ్ చేయడానికి, టేకాఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది.