అద్భుతమైన మైలురాయిని దాటిన నవీన్ పట్నాయక్ .. జ్యోతిబసు రికార్డు బ్రేక్..
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన రాజకీయ జీవితం ఓ అద్భుతమైన మైలురాయిని దాటారు. భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండవ వ్యక్తిగా పశ్చిమ బెంగాల్ మాజీ సిఎం జ్యోతిబసు నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశారు.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరో సరికొత్త రికార్డు సృష్టించారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు పేరిట ఉన్న దేశంలోనే రెండవ అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రికార్డును బ్రేక్ చేశారు. ఆదివారం నుంచి ఈ రికార్డు నవీన్ పట్నాయక్ పేరు మీద ఉంటుంది. నేటీతో నవీన్ పట్నాయక్ దేశంలో రెండవ గరిష్ట రోజుల పాటు ముఖ్యమంత్రి బాధ్యతను నిర్వహించే నాయకుడు అవుతాడు.
ఏకధాటిగా 23 సంవత్సరాల 138 రోజుల పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఇంతకాలం పాటు రికార్డు సృష్టించారు. ఇంతవరకు రెండో స్థానం రికార్డు పశ్చిమ బెంగాల్ దివంగత ముఖ్యమంత్రి జ్యోతి బసు (23 సంవత్సరాల 137 రోజులు) పేరు మీద ఉండగా దానిని అధిగమించారు. మొదటి స్థానం మాత్రం ఇంకా సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్‌పైనే ఉంది. ఆయన ఏకంగా.. 24 ఏళ్ల 5 నెలల 17 రోజుల పాటు సీఎం పదవిలో కొనసాగారు.
పట్నాయక్ ప్రస్థానం
వరుసగా ఐదవసారి ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ పట్నాయక్‌కు 23 సంవత్సరాలు 138వ రోజు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 1997లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2000 మార్చి 5న నవీన్ పట్నాయక్ తొలిసారిగా ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నవీన్ పట్నాయక్ నాయకత్వంలో.. ఒడిశాలోని బిజూ జనతాదళ్ (2000, 2004, 2009, 2014, 2019) అధికారంలోకి వచ్చింది. నవీన్ పట్నాయక్ ఒడిశా ప్రజల మద్దతును నిరంతరం పొందుతున్నారు.23 ఏళ్ల పాలనలో నవీన్ పేరిట ఇదే మొదటి రికార్డు కాదు. బెస్ట్ అడ్మినిస్ట్రేషన్, నంబర్ వన్ ముఖ్యమంత్రి సహా పలు రికార్డులను నవీన్ సొంతం చేసుకున్నారు.
నవీన్ పట్నాయక్ ఒడిశా ఆర్థిక, విద్య, ఆరోగ్యం , ఆహార భద్రత రంగాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అదేవిధంగా పారిశ్రామికీకరణలో ఒడిశాలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విదేశీ పెట్టుబడుల్లో దేశంలోనే ఒడిశా రెండో స్థానంలో నిలిచింది. నవీన్ బలమైన నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం వల్లే ఇదంతా సాధ్యమైంది. నవీన్ పట్నాయక్ రూపొందించిన అనేక సంక్షేమ పథకాలు ఇప్పుడు దేశానికి మార్గదర్శకం.