దేశంలో మరోసారి కోవిడ్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది.
దేశంలో మరోసారి కోవిడ్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 10, 11 తేదీల్లో కోవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో సౌకర్యాలపై మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు చేసింది. ఆసుపత్రులను సందర్శించి మాక్ డ్రిల్స్‌ను పర్యవేక్షించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రులను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ఈ నెల 7వ తేదీన జరిగిన సమీక్షా సమావేశంలో కోరారు.
ఈ క్రమంలోనే నేడు దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రులలో కోవిడ్ సన్నద్దతపై మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. బిహార్ రాజధాని పాట్నాలోని ఐజీఐఎంఎస్ ఆస్పత్రిలో, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రులలో కోవిడ్ సన్నద్దతపై మాక్ డ్రిల్‌ను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో కూడా మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. ఇక, హర్యానాలోని ఝజ్జర్ ఎయిమ్స్‌లో మాక్‌డ్రిల్‌ను మన్సుఖ్ మాండవీయా పరిశీలించనున్నారు.
ఇదిలా ఉంటే.. దేశంలోని మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హర్యానా, కేరళ, పుదుచ్చేరిలు బహిరంగ ప్రదేశాలలో ప్రజలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాయి. అలాగే, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను కోవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలలంటూ హెచ్చరించింది. నోయిడా, ఘజియాబాద్ జిల్లా యంత్రాంగాలు విదేశాల నుంచి వచ్చే ప్రతిఒక్కరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు.
