చెన్నై: నాథూరాం గాడ్సేపై సినీ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారత దేశంలో తొలి హిందూ ఉగ్రవాది గాడ్సే అని ఆయన వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేశాడని అన్నారు. గాంధీ విగ్రహం వద్ద నిలబడి తాను ఈ మాటలు అంటున్నట్లు ఆయన తెలిపారు. 

మక్కల్ నీధి మైయామ్ (ఎంఎన్ఎం) పార్టీని స్థాపించిన కమల్ హాసన్ అరవకురిచి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తన పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ర్యాలీలో గాడ్సేపై ఆ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను సంతోషపెట్టడానికి గాడ్సేపై తాను ఆ వ్యాఖ్యలు చేయడం లేదని అన్నారు. 

స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది హిందువు, అతను నాథూరాం గాడ్సే అని కమల్ హాసన్ అన్నారు. ముస్లింల జనాభా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది కాబట్టి తాను ఈ మాట అనడం లేదని, గాంధీ విగ్రహం వద్ద నిలబడి ఆ మాటలు అంటున్నానని ఆయన అన్నారు. 

భిన్నత్వంలో తాను సమానత్వ భారతాన్ని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మన జాతీయ పతాకలోని మూడు వర్ణాలు చెక్కుచెదరకుండా ఉండాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు.