మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ మహారాష్ట్రలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో గాంధీ బోధనలు అనుసరిస్తున్న వారి సంఖ్య కుచించుకుపోతున్నదని, కానీ, ఆయనను హతమార్చిన నాథురాం గాడ్సే భావజాం పెరిగిపోతున్నదని అన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర ఫలాలను స్మరిస్తూ.. దేశ ఉన్నత చరిత్రను గుర్తు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం చేపడుతున్నదని, కానీ, సమాజంలో మాత్రం విద్వేషపు విషం ప్రబలుతున్నదని వివరించారు. 

ముంబయి: జాతి పిత మహాత్మా గాంధీ(Mahatma Gandhi) మునిమనవడు తుషార్ గాంధీ(Tushar Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహాత్ముడి బోధనలు అనుసరిస్తున్నవారి సంఖ్య కరిగిపోతున్నదని ఆవేదన చెందారు. అంతేకాదు, మహాత్మా గాంధీని హతమార్చిన నాథురాం గాడ్సే(Nathuram Godse) భావజాలం(Ideology) ప్రమాదకరంగా పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య సంబురాలను కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట నిర్వహిస్తున్నదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కానీ, అదే సమయంలో విద్వేషపు విషాన్ని(Hatred) సమాజంలో వెదజల్లుతున్నారని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహారాష్ట్రలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. జాల్నాలోని జేఈఎస్ కాలేజీలోని గాంధీ స్టడీ సెంటర్ ‘కర్ కే దేఖో’ పేరిట ఓ వర్చువల్ ప్రోగ్రామ్‌ను కండక్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో తుషార్ గాంధీ మాట్లాడారు.

భారత దేశ గొప్ప చరిత్రను, దాని 75 ఏళ్ల స్వాతంత్ర్య ఫలాలను స్మరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ తెలిపారు. కానీ, ఇప్పుడు ఆ అమృతం విద్వేషపు విషంగా మారిందని వివరించారు. అది క్రమంగా ఇంకా పెరుగుతూ పోతున్నదని అన్నారు.

మహాత్ముడి బోధనలు చదువుతున్న వారి సంఖ్య క్రమంగా కరిగిపోతున్నదని అన్నారు. అయితే, ఆ మహాత్ముడిని పొట్టనబెట్టుకున్న నాథురాం గాడ్సే భావజాలం డామినేటింగ్ అవుతున్నదని వివరించారు. కొన్ని వర్గాల ప్రజలు చరిత్రను వక్రీకరిస్తున్నారని, వారి సొంత భాష్యాలను జోడిస్తున్నారని ఆరోపించారు. వారికి నచ్చిన విధంగా అనుకూలించిన మార్గంలో చరిత్రను మార్చే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారని తెలిపారు. కానీ, ఇప్పుడు మనమంతా నిజమైన చరిత్రను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఈ విద్వేషపు విషానికి, సమాజ అంతరాలకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. 

మనం హింస, ద్వేషం, విచ్ఛిన్న సంస్కృతిని ఎంచుకుంటున్నామని ఆయన అన్నారు. మతం, కులం, ప్రాంతం ఆధారంగా విడగొడుతున్నారని వివరించారు. ఇప్పుడు ఒకరి అస్తిత్వం, ఆలోచనలే ఈ అంతరాలుగా మారుతున్నాయని చెప్పారు. మొత్తం సమాజ నిర్మాణమే ఈ విభజించిన దొంతరలపై ఆధారపడుతున్నదని పేర్కొన్నారు.

ఒక దేశం అంటే కేవలం సరిహద్దు కాదు.. ఒక జెండా కాదు.. ఒక మ్యాప్ కాదని తుషార్ గాంధీ తెలిపారు. ఒక దేశం అంటే.. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలందరు అని వివరించారు. దేశం అంటే ఆ ప్రజలే.. ప్రజలే దేశమని తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌కు పెట్టిన పేరు కర్ కే దేఖో వాక్య నేపథ్యాన్ని వివరించారు. స్వాతంత్ర్య సమరానికి ముందు మహాత్మా గాంధీ దండి మార్చ్ చేపట్టడానికి కర్ కే దేఖో(చేసి చూడు) అనే మాట అన్నారని పేర్కొన్నారు. దండి మార్చ్ పిలుపును అప్పటి కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారని, ఆ పిలుపు విజయవంతం కాకపోవచ్చని చాలా మంది శంకించారు. అది పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దిగజార్చే ముప్పు ఉన్నదని అభిప్రాయపడ్డారు. కానీ, మహాత్మా గాంధీ అలాంటి సంశయాలను పెద్దగా పట్టించుకోలేదు. ఒక సారి చేసి చూడండి అంటూ వారికి ఒకే వాక్యంలో సమాధానం చెప్పారని తెలిపారు. 

ఆ వాక్యంతోనే దండి మార్చ్ విజయవంతం అవుతుందని ఆయన వెల్లడించారని తుషార్ గాంధీ తెలిపారు. ఆ తర్వాత చేపట్టిన దండి మార్చ్‌కు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. దేశానికి స్వాతంత్రం అందించడంలో దండి మార్చ్ ఉద్యమం కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఇప్పుడు కూడా మహాత్మా గాంధీ పేర్కొన్న కర్ కే దేఖో అనే పదాలను గుర్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పుడు కూడా సమాజంలో ప్రబలుతున్న విద్వేషానికి, అసమానత్వానికి, విచ్ఛిన్న శక్తులను ఎదుర్కోవడానికి మహాత్ముడి ఇచ్చిన పిలుపు కర్ కే దేఖోను శిరోదార్యంగా భావించి పోరాటం చేయాలని అన్నారు. మహాత్ముడి బోధనలు అనుసరించే వారు ఆయనకు అర్పించే నిజమైన నివాళి అదేనని పేర్కొన్నారు.