హిందూ క్యాలెండర్ ప్రకారం మోడీ బర్త్‌డే: రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
హిందూ క్యాలెండర్ ప్రకారంగా ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజున రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం లభించింది.

న్యూఢిల్లీ: హిందూ క్యాలెండర్ ప్రకారంగా ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజున రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించింది.ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజున పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రారంభించారు. పార్లమెంట్ కొత్త భవనంలో సమావేశాలు గణేష్ చతుర్థి రోజున ప్రారంభమయ్యాయి.లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీశక్తి వందన్ ) ఈ నెల 20వ తేదీన ఆమోదం పొందింది. ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత ఇష్టమైన వకీల్ సాహెబ్ జయంతి. అంతేకాదు ఆ రోజు రిషి పంచమి.
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం కోసం చాలా ఏళ్లుగా పలు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.అయినా ఈ నెలలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం దక్కింది. పార్లమెంట్ కొత్త భవనంలో మహిళా రిజర్వేషన్ బిల్లే తొలి బిల్లు కావడం విశేషం. అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు పలికాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో కూడ నరేంద్ర మోడీ చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం పెరగాలనే డిమాండ్ కు మద్దతుగా నిలిచారు. ఈ విషయమై 2000 ఏప్రిల్ లో పంజాబ్ రాష్ట్రంలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో మీడియాతో ఈ విషయమై మోడీ తన అభిప్రాయాలను పంచుకున్నారు.