మోదీతో నాకు పెళ్లైంది, ఆయనే నాకు రాముడు: జశోదాబెన్

Narendra Modi Is Ram For Me: Jashodaben
Highlights

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైవాహిక స్థితి గురించి వస్తున్న విమర్శలపై ఆయన సతీమణి జశోదాబెన్ స్పందించారు.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైవాహిక స్థితి గురించి వస్తున్న విమర్శలపై ఆయన సతీమణి జశోదాబెన్ స్పందించారు. నరేంద్ర మోదీ అవివాహితులు కాదని, ఆమెకు, తనకు వివాహం జరిగిందని, ఆయన తనకి రాముడు లాంటి వారని జశోదాబెన్ ఓ ఆంగ్ల ఛానెల్‌తో చెప్పారు. మోదీ అవివాహితుడని మధ్యప్రదేష్ గవర్నర్ ఆనందీ బెన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఇలా స్పందించారు.

ఆమె ఓ మహిళ అయ్యుండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం తనని ఆశ్చర్యానికి గురిచేసిందని, మోదీకి తనకి వివాహం జరిగినా కూడా కొందరు ఇలా మాట్లాడటం వింటుంటే చాలా బాధగా ఉందని జశోదాబెన్ అన్నారు. ఆనందీ బెన్ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, మోదీకి పెళ్లయిందని అందరకీ తెలుసునని అయినా కూడా జనాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె చెప్పారు.

నరేంద్ర మోదీకి పెళ్లి ఎప్పుడు జరిగింది? వీరిద్దరూ ఎందుకు విడిపోయారు..?

నరేంద్ర మోదీకి 17 ఏళ్ల వయసులోనే జశోదాబెన్‌తో పెళ్లి చేశారు. అప్పుడు ఆమె వయస్సు సుమారు 15 ఏళ్లు ఉండేవట. ఈ విషయం గురించి మోదీ సోదరుడు సోమాభాయ్ దామోదర్ దాస్ మోదీ ఒక సందర్భంలో ప్రస్తావిస్తూ.. తమ కులంలో బాల్య వివాహం ఆచారం ఉండేదని, అందుకే మోదీకి 17 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశామని చెప్పారు.

పెళ్లయిన కొద్ది రోజులకే వీరిద్దరూ విడిపోయినప్పటికీ, వాళ్లెప్పుడూ తమ వివాహ బంధాన్ని మాత్రం తెంచుకోలేదని దామోదర్ దాస్ అన్నారు. అయితే, విమర్శకుల వాదన మాత్రం మరోలా ఉంది. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉండదని, అందుకే అందులో చేరిన తర్వాత మోదీ, జశోదాబెన్‌ను వదిలేశారని చెప్పేవారు కూడా ఉన్నారు.

loader