తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా మండిపడ్డారు.

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసిఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కేసిఆర్ ప్రశంసిస్తున్నారని ఆయన శనివారం మీడియాతో అన్నారు. 

ఫెడరల్‌ ఫ్రంట్‌తో అందర్నీ చీల్చు అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లున్నారని, కేసీఆర్‌ మోడీతో కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్‌ మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనిఅన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ని ప్రజల నమ్మరని ఆయన జోస్యం చెప్పారు

తెలంగాణ ఏర్పడి నాలుగేళ్లు పూర్తయి సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారని, మొదటి దశగా నిరుద్యోగులకు25 వేలు ఉద్యోగాలు ఇచ్చారని, ఇప్పుడు 50 వేలు ఉద్యోగాలు ప్రకటించామంటున్నారని ఆయన అన్నారు. 

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇంటికో ఉద్యోగం హామీ ఏమైందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన రూ. 4000 రైతులకు ఉపయోగపడిందా అని ఆయన అడిగారు. రైతుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. రూ. 4000 రైతులకు ఇచ్చి, పరమానందయ్య శిష్యులు మొద్దుకి సూది పొడిచినట్లు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.