ఏపీ నుంచి కేంద్ర కేబినెట్‌కు పెండింగ్‌లో ఉన్న పేర్లివే....
ఆంధ్రప్రదేశ్ నుంచి మరో ముగ్గురు ఎంపీలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కనుంది. ఈ మేరకు ఢిల్లీ వర్గాల సమాచారం. ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం జరగనున్న తరుణంలో త్వరలోనే ఈ అంశంపై స్పష్టత రానుంది.
కేంద్ర ప్రభుత్వంలో కనీసం రెండు నుంచి నాలుగు పదవులు కోరిన తెలుగుదేశం పార్టీకి రెండు మంత్రి పదవులు ఖాయమయ్యాయి. మరో కీలక పదవి కూడా టీడీపీకి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ (ఆదివారం) ప్రధాని మోదీతో కలిసి కేంద్ర మంత్రులుగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక, తెలుగుదేశం పార్టీ నుంచి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, జనసేన తరఫున సీనియర్ నేత, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిలను కూడా కేంద్ర పదవులు వరించనున్నట్లు ఆయా పార్టీల ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకొన్న ఆయన... నెల్లూరు పార్లమెంటు బరిలో దిగి విజయం సాధించారు. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డిపై 2లక్షల 45వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పారిశ్రామికవేత్త. వీపీఆర్ మైనింగ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు. 2018లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫౌండేషన్ పేరిట అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2015లో నెల్లూరులో విపీఆర్ వికాస్, విపీఆర్ విద్య, విపీఆర్ వైద్య పేరుతో విభిన్న సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి కొనసాగిస్తున్నారు.
ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి.. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
దగ్గుబాటి పురందేశ్వరి... దివంగత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కుమార్తె సుపరిచితులు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు. రాజమహేంద్రవరం పార్లమెంటు బరిలో నిలిచి గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్‌పై 2లక్షల 39వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు.
పురందేశ్వరికి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. 2004 కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో అదే పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మానవ వనరుల అభివృద్ధి, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖల మంత్రిగా పనిచేశారు. ఇక, 2019లో రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు నుంచి విజయ కేతనం ఎగురవేశారు.
వల్లభనేని బాలశౌరి... కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటు నుంచి ఎంపీగా విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ రావుపై 2లక్షల 23వేలపై చిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మచిలీపట్నం నియోజవర్గంలో 7లక్షల 24వేల 439 ఓట్లను దక్కించుకొని మూడోసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2004లో తొలిసారి తెనాలి, 2019లో రెండోసారి మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. జనసేన నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఇద్దరు ఎంపీల్లో బాలశౌరి సీనియర్.