నా ఇజ్రాయెలీ భార్యను భారత్‌కు సురక్షితంగా తీసుకురండి: అధికారులకు నాగ్‌పూర్ వాసి విజ్ఞప్తి
నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఇజ్రాయెలీ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమె బంధువులను కలుసుకోవడానికి జనవరిలో ఇజ్రాయెల్ వెళ్లింది. ఇంతలో యుద్ధం మొదలు కావడంతో ఆమె తిరిగి భారత్‌కు రావడం కష్టతరమైంది. తన భార్యను, మూడున్నరేళ్ల కొడుకును సురక్షితంగా ఇండియాకు తీసుకురావాలని ఇక్కడే ఉన్న ఆమె భర్త అధికారులకు విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఇజ్రాయెల్‌కు చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి కొడుకు పుట్టాడు. వారు భారత్‌లోనే ఉంటున్నారు. అయితే.. బంధువులను చూడటానికి భార్య, కొడుకు ఇజ్రాయెల్ వెళ్లారు. వారు వెళ్లాకే అక్కడ యుద్ధం మొదలైంది. ఇప్పుడు వారు అక్కడే చిక్కుకుని ఉన్నారు. దయచేసి తన భార్యను, కొడుకును భారత్‌కు సురక్షితంగా తీసుకురావాలని ఆ నాగ్‌పూర్ వాసి భారత అధికారులకు విజ్ఞప్తి చేశారు.
తన భార్యకు ఇజ్రాయెల్ పాస్‌పోర్టు ఉన్నదని అంకుశ్ జైస్వాల్ తెలిపాడు. జనవరి నెలలో తన భార్య, మూడున్నరేళ్ల కొడుకు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు తూర్పున ఉండే బ్నెయి బ్రాక్‌కు వెళ్లారు.
‘నా భార్య, కొడుకును ఇజ్రాయెల్ నుంచి భారత ప్రభుత్వం మిషన్ ఆపరేషన్ కింద ఇక్కడికి తీసుకురావడం లేదు. ఎందుకంటే ఆమె ఇజ్రాయెల్ పాస్‌పోర్టును కలిగి ఉన్నది. కానీ, అజయ్ మిషన్ కేవలం భారత పౌరులకు ఉద్దేశించినదే. ఆమె ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇజ్రాయెల్ ఉభయ పౌరసత్వాన్ని అంగీకరిస్తుంది, కానీ, భారత్ అంగీకరించదు. కాబట్టి, అధికారులు నా భార్యను, కొడుకును అజయ్ మిషన్ కింద భారత్‌కు తీసుకురావడం లేదు.’ అని అంకుశ్ అన్నారు.
Also Read : జైలు నుంచే ఢిల్లీ ప్రభుత్వం నడుస్తుంది, క్యాబినెట్ సమావేశాలు కూడా జైలులోనే..! :ఆప్ సంచలన నిర్ణయాలు
ఇజ్రాయెల్‌లోని ఇండియన్ ఎంబసీని నా భార్య ఆశ్రయించిందని అంకుశ్ వివరించారు. మ్యారేజీ సర్టిఫికేట్, భర్త పాస్ పోర్టు, ఇతర డాక్యుమెంట్లను అధికారులకు చూపించిందని తెలిపారు. కానీ, వారిని తిరిగి ఇండియాకు పంపడానికి ఒక భారతీయుడు అకాంపనీగా ఉండాలని, అలా ఉంటేనే పంపుతామని అధికారులు చెప్పినట్టు వివరించారు.
‘అక్కడ యుద్ధం జరుగుతున్నది. నా భార్య, బిడ్డ భద్రత పై నాకు భయాలు ఉన్నాయి. కాబట్టి, దయచేసి వారిని భారత్‌కు సురక్షితంగా తీసుకురావాలని భారత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పీటీఐతో చెప్పారు.