Asianet News TeluguAsianet News Telugu

జైలు నుంచే ఢిల్లీ ప్రభుత్వం నడుస్తుంది, క్యాబినెట్ సమావేశాలు కూడా జైలులోనే..! :ఆప్ సంచలన నిర్ణయాలు

ఒక వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయితే.. జైలు నుంచే ప్రభుత్వం నడుస్తుందని ఆప్ వెల్లడించింది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా కొనసాగుతారని, క్యాబినెట్ సమావేశాలనూ జైలులో నిర్వహించడానికి కోర్టు ద్వారా అనుమతులు పొందుతామని తెలిపింది.
 

if delhi cm arvind kejriwal arrested government will run from jail says AAP kms
Author
First Published Nov 6, 2023, 7:33 PM IST

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రూలింగ్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఒక వేళ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం జైలు నుంచే పని చేస్తుందని ఈ రోజు వెల్లడించింది. అంతేకాదు, క్యాబినెట్ సమావేశాలు కూడా జైలులోనే జరుగుతాయని, ఇందుకోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతులు పొందుతామని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు పంపిన తర్వాత ఆయన ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.

ఇది కేజ్రీవాల్‌ను జైలులో పెట్టాలన్న మోడీ ప్రభుత్వ కుట్రేనని ఆప్ ఆరోపించింది. అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశం తర్వాత ఢిల్లీ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లు సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘రాజీనామా చేయవద్దని మేం ఆయనకు సూచించాం. ఢిల్లీ ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపించారని గుర్తు చేశాం. ఒక వేళ అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లినా ఆయనే ఢిల్లీ సీఎంగా కొనసాగుతారు’ అని వెల్లడించారు. క్యాబినెట్ సమావేశాలు జైలులో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం కోర్టు ద్వారా అనుమతులు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం జైలు నుంచి నడుస్తుందనీ వివరించారు. త్వరలోనే అరవింద్ కేజ్రీవాల్ ఆప్ కౌన్సిలర్లతోనూ సమావేశం అవుతారని తెలిపారు.

Also Read: ప్యారాచుట్ నేతలకు టికెట్లు, ఉన్నత పదవులు.. తెలంగాణ బీజేపీ సీనియర్ నేతల్లో అసంతృప్తి జ్వాలలు

గతవారమే అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు పంపింది. నవంబర్ 2వ తేదీన దర్యాప్తునకు హాజరు కావాలని ఆదేశించగా.. ఆ సమన్లు అక్రమం అని, రాజకీయ ప్రేరేపితమైనవని పేర్కొన్న కేజ్రీవాల్ ఈడీ దర్యాప్తునకు హాజరు కాలేదు.

ఢిల్లీ మాజీ డిప్యూటీ మనీశ్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లు అరెస్టు అయిన కేసులోనే అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా ఈడీ సమన్లు పంపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఏప్రిల్ నెలలో సీబీఐ అరవింద్ కేజ్రీవాల్‌ను సుమారు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది.

Follow Us:
Download App:
  • android
  • ios