న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీకి జ్యోతిరాదిత్య సింథియా చేసిన రాజీనామాపై సినీ నటి, పార్టీ నేత నగ్మా సంచలన వ్యాఖ్యలు చేశారు. సింథియా పార్టీని వీడడంపై సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. సింథియా రాజీనామా కాంగ్రెసు పార్టీలోని అసమ్మతి నేతలకు మార్గం సుగమం చేసిందని ఆమె అభిప్రాయపడ్డారు. 

బుధవారం ట్విట్టర్ వేదికగా ఆమె తన స్పందనను తెలియజేశారు. కాంగ్రెసు పార్టీలోని చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నారని, దాన్ని కనిపెట్టడంలో అధిష్టానం విఫలమైందని ఆమె వ్యాఖ్యానించారు. మరికొంత మంది అసమ్మతి నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు. సచిన్ పైలట్ చేసిన ట్వీట్ కు ఆమె స్పంది,స్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. 

 

జ్యోతిరాదిత్య సింథియా బుధవారం బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. మంగళవారం కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన ఆయన పార్టీ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో బిజెపిలో చేరారు. ఆ వెంటనే మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బిజెపి ఆయనను నామినేట్ చేసింది. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.