భారీ వర్షాల కారణంగా ఇటీవల కేరళతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే. ఈ వరద కారణంగా చాలా మంది మృత్యువాత పడటంతో పాటు చాలా మంది వరద బాధితులుగా మారారు. ఇలా దక్షిణాదినే కాదు ఉత్తరాదిని కూడా వరదలు వదలడం లేదు. ఉత్తరా ఖండ్, డిల్లీల్లో కూడా భారీ వర్షాలు కురిసి నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వరదలు ఈశాన్య రాష్ట్రాలకు పాకాయి. 

నాగాలాండ్ లో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతూ వరదలకు దారితీస్తున్నాయి. ఈ వర్షాల తాకిడికి కొండ చరియలు విరిగి పడటం, నదులు ఉప్పొంగడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 12 మంది మృత్యువాతపడగా చాలా మంది నిరాశ్రయులయ్యారు. 

ఈ ప్రకృతి విలయానికి దాదాపు 400 గ్రామాలు నీట మునిగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వర్షాలతో నాగాలాండ్ తీవ్రంగా నష్టపోయినట్లు సీఎం నైపూ రియో ట్వీట్ చేశారు.'' రాష్ట్రంలోని పలు రాష్ట్రాలు వరదల తాకిడికి అతలాకుతలం అవుతున్నాయి.ఇక్కడి ప్రజలను ఆదుకోడానికి మీ సాయం అవసరం'' అవసరం అంటూ సీఎం పేర్కొన్నారు.