నేటి మధ్యాహ్నం 1.45 ప్రాంతంలో బెంగళూరు నగరంలో ఉన్నట్టుండి  ఒక  పెద్ద  శబ్దం వినిపించింది. సౌత్ బెంగళూరు ప్రాంతంలోని వైట్ ఫీల్డ్, హెచ్ ఎస్ ఆర్  లేఅవుట్  ఏరియాల్లో ఈ శబ్దం వినిపించింది. ఒక్కసారిగా శబ్దం వినిపించడంతో ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు. అసలే మొన్న కర్ణాటక లో ఒకింత భూమి కంపించిన నేపథ్యంలో ప్రజలంతా దీన్ని కూడా భూకంపమేమో అని భావించారు. 

తొలుత ఇది సౌత్ బెంగళూరు ప్రాంతంలో మాత్రమే వినిపించిందని భావించినా తరువాత ఈ శబ్దం అన్ని ప్రాంతాల్లో కూడా వినిపించిందని ప్రజలంతా ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. 

కానీ కర్ణాటక విపత్తు నిర్వహణ సంస్థ మాత్రం ఇది భూకంపం కాదని, రిక్టర్ స్కేల్ పై ఎటువంటి కంపనలు రికార్డు అవలేదని వారు తెలిపారు. పోలీసు విభాగం తో మాట్లాడినప్పుడు ఇది బహుశా ఫైటర్ ప్లేన్ వల్ల వచ్చిన సోనిక్ బూమ్ అయి ఉండొచ్చని అన్నారు. 

మరికొద్ది సేపట్లో పోలీసులు అధికారికంగా ఈ విషయంఫై ప్రకటన చేయనున్నారు. కొందరు ప్రజలు పిడుగుపాటు అనుకుంటే... మరికొందరు ఏదో పర్యావరణంలో వచ్చిన మార్పు అని అనుకున్నారు. ఇంకొందరు నెటిజెన్ల యధావిధిగా తమ క్రియేటివిటీని చూపించారు.