‘రజనీకాంత్ నాకెందుకు తెలీదు..? కావాలనే అలా అడిగాను’

my intention misinterpreted..thutookudi survivor who questioned rajini clarifies
Highlights

రజినీకాంత్ ని ‘మీరెవరు’ అని ప్రశ్నించిన యువకుడు

సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఓ  యువకుడు ‘ మీరెవరు’ అని అడిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కాగా.. అలా రజనీకాంత్ ని మీరు ఎవరు అని అడిగి ఆ యువకుడు నెట్టింట వైరల్ అయ్యాడు. అయితే.. దీనిపై ఆ యువకుడు  సంతోష్ రాజ్ వివరణ ఇచ్చాడు.

తూత్తుకుడి కాల్పుల ఘటనలో గాయపడిన వారిని పరామర్శించేందుకు రజనీ ఇటీవల ఓ ఆస్పత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ తీవ్రంగా గాయపడిన సంతోష్‌ అనే బాధితుడిని పరామర్శిస్తుంటే అతను ‘మీరెవరు’ అని రజనీని అడిగాడు. దాంతో అక్కడున్న బాధితులతో పాటు రజనీతో ఉన్న సహచరులు కూడా షాకయ్యారు.

కానీ రజనీ మాత్రం నవ్వుకుని వెళ్లిపోయారు. అయితే తాను ఎందుకు రజనీని అలా అడగాల్సి వచ్చిందో తాజాగా సంతోష్‌ ఓ ఆంగ్ల మీడియాకు వివరించాడు. ‘నా మాటలను మీడియా వక్రీకరించి రాసింది. నాకు రజనీ తెలియకపోవడమేంటి? నేను ఆయన్ని ‘మీరెవరు’ అని అడిగిన మాట నిజమే. కానీ నిజంగా ఆయన ఎవరో తెలీక అలా అడగలేదు. తూత్తుకుడి ఘటనలో మేమంతా తీవ్రంగా గాయపడి బాధపడుతుంటే ఇన్ని రోజుల తర్వాత ఆయన వచ్చి ‘ఎలా ఉంది’ అని అడగడంతో నాకు కోపం వచ్చింది. రజనీనే కాదు అంతకుముందు వచ్చిన వీఐపీలను కూడా ఇలాగే ప్రశ్నించాను. కానీ నా మాటలను మీడియా వర్గాలు తప్పుగా రాయడం నాకు బాధకలిగించింది’ అని వెల్లడించాడు సంతోష్‌.
 

loader