యూపీ సీఎం యోగి జనాభాపై చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. ముస్లింలే ఎక్కువ గర్భనిరోధకాలు వాడుతున్నారని అన్నారు.  

హైదరాబాద్: అసంతులన జనాభా అంటూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైస్ కౌంటర్ ఇచ్చారు. ముస్లింలే ఎక్కువగా గర్భనిరోధక మాత్రలు (లేదా ఇతర విధానాలు) పాటిస్తున్నారని వివరించారు.

‘ముస్లింలు భారత మూలనివాసులు కాదా? నిజంగా మనం వాస్తవాలను పరిశీలిస్తే.. గిరిజనులు, డ్రవిడులు మాత్రమే మూలనివాసులు. ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి చట్టం అవసరం లేకుండానే ఆశించిన సంతాన రేటును 2026 నుంచి 2030 మధ్యలో అందుకోనుంది’ అని అసదుద్దీన్ ఒవైసీ ఏఎన్ఐ మీడియా ఏజెన్సీకి వివరించారు.

వారి సొంత ఆరోగ్య మంత్రినే స్వయంగా ఈ విషయాలు చెప్పాడని అసదుద్దీన్ అన్నారు. దేశంలో జనాభా నియంత్రణకు చట్టం అవసరం లేదని తెలిపారని వివరించారు. దేశంలో ముస్లింలు ఎక్కువగా కాంట్రాసెప్టివ్స్ వాడుతున్నారని పేర్కొన్నారు. 2016లో మొత్తం సంతాన రేటు 2.6గా ఉన్నదని, ప్రస్తుతం 2.3గా ఉన్నదని తెలిపారు. దేశ డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్ని దేశాల్లోకెల్లా బాగున్నదని అన్నారు.

సోమవారం యునైటెడ్ నేషన్స్ జనాభాకు సంబంధించిన రిపోర్టు విడుదల చేసింది. 2023లో చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలుస్తుందని ఆ రిపోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ మాట్లాడుతూ, జనాభా నియంత్రణ కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టాలని, కానీ, అసంతులన జనాభాను ఆహ్వానించరాదని తెలిపారు.

కొన్ని వర్గాల జనాభా ఎక్కువగా.. వాటి జనాభా వేగంగా పెరిగే ముప్పును అరికట్టాలని, ఈ దేశ మూలనివాసుల జనాభాను సుస్థిరం చేయాలని యోగి వివరించారు. దీన్ని అవగాహన కల్పించి సాధించగలం అని చెప్పారు.