అస్సాంలోని అనేక జిల్లాలో హిందువులు మైనారిటీలుగా ఉన్నారని ఆ రాష్ట్ర సీఎం హిమంత్  బిస్వా శర్మ అన్నారు. ఇది తన అభిప్రాయం కాదని, గణాంకాలు ఇదే చెబుతున్నాయని తెలిపారు. అనేక చోట్ల ముస్లింలు మెజారిటీలుగా ఉన్నారని చెప్పారు. 

అస్సాంలో ముస్లిం స‌మాజానికి ఇక నుంచి మైనారిటీ అర్హ‌త లేద‌ని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక జిల్లాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారని ఆయన అన్నారు. ముస్లింల‌ను మైనారిటీలుగా ప‌రిగ‌ణించ‌లేమ‌ని తెలిపారు. 

“ రాష్ట్రంలో హిందువులు మెజారిటీగా లేనప్పుడు, వారిని మైనారిటీలుగా ప్రకటించవచ్చు. కానీ జిల్లాలో హిందూ సమాజం మెజారిటీగా లేనప్పుడు, ఆ జిల్లాలో హిందువులను కూడా మైనారిటీగా ప్రకటించాలని నేను అభ్యర్థించాల‌ని అనుకుంటున్నాను. అస్సాంలో హిందువులు మైనారిటీలుగా నిస్సహాయంగా ఉన్న అనేక జిల్లాలు ఉన్నాయి. వాటిలో కొన్ని జిల్లాలో అయితే 5,000 కంటే తక్కువ మంది హిందువులు కూడా ఉన్నారు ” అని వార్తా సంస్థ ఏఎన్ఐతో సీఎం తెలిపారు. 

‘‘ అస్సాంలో ముస్లిం సమాజం మెజారిటీ. అతిపెద్ద కమ్యూనిటీ. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు. దీనిని గ‌ణాంకాలు రుజువు చేస్తున్నాయి. ఈ గణాంకాల ప్రకారం అస్సాంలో ముస్లింలు అతిపెద్ద కమ్యూనిటీ’’ అని సీఎం హిమంత్ బిస్వా శర్మ అన్నారు. అస్సాం జనాభాలో ముస్లింలు 35 శాతం ఉన్నార‌ని తెలిపారు. అయితే ఇక్క‌డి మైనారిటీల‌ను ర‌క్షించ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త హిమంత బిస్వా శర్మ అని అన్నారు. 

కాగా అస్సాంలో దాదాపు నాలుగు శాతం ముస్లిం జనాభా స్థానిక అస్సామీ ముస్లింలు. మిగితా మెజారిటీ ముస్లింలు బెంగాలీ మాట్లాడుతారు. గ‌తంలో అస్సాం సీఎం హిమంత‌ బిస్వా శర్మ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) సమీక్షించాల‌ని పిలుపునిచ్చారు. ఈ విష‌యంలో తాజా క‌స‌ర‌త్తు చేయాల‌ని తెలిపారు. 

‘‘ పాత ఎన్‌ఆర్‌సీని సమీక్షించాలని, దానిని మళ్లీ నిర్వహించాలని మేము ఇంతకు ముందే చెప్పాము. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్‌యూ)తో మా చర్చ కొనసాగుతోంది. రాష్ట్రంలో మళ్లీ ఎన్‌ఆర్సీ చేయాలని మేము కోరుకుంటున్నాము ’’ అని సీఎం హిమంత‌ బిస్వా శర్మ అన్నారు. ఇదిలా ఉండ‌గా 2019 సంవ‌త్స‌రం ఆగ‌స్టులో నిర్వ‌హించిన ఎన్ఆర్సీలో 3.3 కోట్ల మంది దరఖాస్తుదారుల్లో 19.06 లక్షల మంది వ్యక్తులు ఈ జాబితాకు దూరంగా ఉన్నారు.