కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హిజాబ్ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసిన మహిళ కనీజ్ ఫాతిమా గెలుపొందారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థినులతో కలిసి ఆందోళన చేసిన ఆమె బీజేపీ అభ్యర్థి చంద్రకాంత్ బీ పాటిల్ పై సుమారు 3 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ హిజాబ్ బ్యాన్ చేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. విద్యా సంస్థల్లోకి ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి వెళ్లరాదని కర్ణాటక విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ గతేడాది ఫిబ్రవరిలో కాలబురగి జిల్లా కలెక్టరేట్ ఎదుట కొందరు విద్యార్థినులను జమచేసి కాంగ్రెస్ లీడర్ కనీజ్ ఫాతిమా ఆందోళన చేశారు.
ఇప్పుడు ఆ కనీజ్ ఫాతిమా కాంగ్రెస్ టికెట్ పై బీజేపీ అభ్యర్థి చంద్రకాంత్ బీ పాటిల్‌ను ఓడించి గుల్బర్గ నార్త్ నియోజకవర్గంలో గెలుపొందారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలో ఏకైక మహిళా ముస్లిం ఈమెనే. హిజాబ్ బ్యాన్‌కు వ్యతిరేకం ఆందోళనలు చేసిన అతి కొద్ది మంది కాంగ్రెస్ నేతల్లో ఆమె ఒకరు.
కనీజ్ ఫాతిమా 2018లోనే బీజేపీ అభ్యర్థి చంద్రకాంత్ బీ పాటిల్‌ను ఓడించారు. అప్పుడు 5,940 వోట్ల మార్జిన్‌తో ఆమె గెలిచారు. తాజాగా, అదే గుల్బర్గా నార్త్ నియోజకవర్గం నుంచి అదే బీజేపీ అభ్యర్థిపై 2,712 వోట్ల మార్జిన్‌తో గెలిచారు. గుల్బర్గా నార్త్ నియోజకవర్గం ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న నియోజకవర్గం.
Also Read: ద్రవిడ నేలపై బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది: కాంగ్రెస్‌కు స్టాలిన్ అభినందనలు
హిజాబ్ బ్యాన్ ద్వారా ముస్లిం విద్యార్థినుల విద్యా హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఈ నిర్ణయం ద్వారా బీజేపీ మతపరమైన ఉద్రిక్తతలు రాజేయాలని ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. అదే సమయంలో ఆమె ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దమ్ముంటే హిజాబ్ ధరించిన తనను అసెంబ్లీకి రాకుంటా ఆపగలరా? అని సవాల్ విసిరారు.
డిసెంబర్ 2019లోనూ చిట్టాపూర్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గేతో కలిసి ఆమె కాలబురగిలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలో పాల్గొన్నారు.
