ముంబై పట్టణంలో కరోనా కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మేయర్ కిషోరి పెడ్నేకర్ తెలిపారు. హాస్పిటల్ బెడ్స్, ఆక్సిజన్ ప్లాంట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని అన్నారు.
మహారాష్ట్రలోని ముంబైలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళనలు ఎక్కువవుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాజధానిలోనే కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ స్పందించారు. కోవిడ్ సునామిని ఎదుర్కొనేందుకు ముంబై సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో డెల్టా వేరియంట్ పుట్టిందని, తరువాత ఒమిక్రాన్ వేరియంట్ ఉద్భవించిందని తెలిపారు. అయితే అన్ని వేరియంట్లను ఎదుర్కొనేందుకు ముంబైలోని హాస్పిటల్స్, కోవిడ్ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
మనుషుల జీవితాలతో ఆడుకుంటారా?.. ప్రియాంక గాంధీపై బీజేపీ ఫైర్..
ముంబై పట్టణలంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోందని మేయర్ కిషోరి పెడ్నేకర్ అన్నారు. ముంబైలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేస్తున్నామని అన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని, అలాంటి వారికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారని చెప్పారు. తాము ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటిస్తున్నామని తెలిపారు. ముంబైలో అధిక సంఖ్యలో క్వారంటైన్ సెంటర్లు ఉన్నాయని అన్నారు. ఈ క్వారంటైన్ సెంటర్లు ముంబైతో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా ఉండటం వల్ల ఇవి కరోనాను కంట్రోల్ చేయడంలో ఎంతో సహకరిస్తాయని చెప్పారు. అయినా కరోనా కేసులు ఎప్పుడు పెరిగినా దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
మహారాష్ట్రలో సెకండ్ వేవ్ వచ్చిన సమయంలో ముంబై పట్టణం హాస్పిటల్ బెడ్స్, ఆక్సిజన్ కొరతను తీవ్రంగా ఎదుర్కొందని చెప్పారు. ఆ రెండో వేవ్ నేర్పిన అనుభవాల నుంచి తాము గుణపాఠాలను నేర్చుకున్నామని చెప్పారు. రెండో వేవ్‌లో ఎదురైన సమస్యలను మళ్లీ ఎదురుకాకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆరోగ్య సిబ్బందిని నియమించుకున్నామని తెలిపారు. దీంతో పాటు 30 వేల బెడ్స్ సిద్ధంగా ఉంచుకున్నామని చెప్పారు. దీంతో పాటు ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
కరోనా సోకినా.. ఆక్సిజన్ అవసరమయ్యేవారు తక్కువే..!
జనవరి 31 వరకు స్కూళ్ల మూసివేత..
ముంబైలో కరోనా కేసులు పెరుగుతుండటంతో స్కూళ్లను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కరోనా విజృంభణ నేపథ్యంలో జనవరి 31 వరకు స్కూల్స్ పూర్తిగా మూసివేయబడతాయని పేర్కొంది. ఒకటి నుంచి 9వ తరగతులకు మాత్రమే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఎప్పటి లాగే పదో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు క్లాసులు కొనసాగుతాయని చెప్పింది. అయితే కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఈ క్లాసులను నిర్వహించాలని స్పష్టం చేసింది. క్లాసులు నిర్వహించే సమయంలో తప్పకుండా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని ఆదేశించారు. ప్రస్తుతం కరోనా కేసులు రాష్ట్రంలో వివరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధించే అవకాశాలు లేకపోలేదని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. స్కూళ్ల మూసివేత నిర్ణయం రాష్ట్ర వ్యాప్తం చేసే అవకాశాలు సైతం ఉన్నాయన్నారు.
