గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మౌ అసెంబ్లీ స్థానం నుండి పలు దఫాలు ప్రాతినిథ్యం వహించిన డాన్ ముక్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందాడు.
లక్నో: 1997-2022 మధ్యకాలంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మౌ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహించిన ముఖ్తార్ అన్సారీ గురువారం నాడు సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు.
ప్రస్తుతం జైలులో ఉన్న అన్సారీకి గుండెపోటు రావడంతో జైలు సిబ్బంది రాణి దుర్గావతి మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అయితే మెడికల్ కాలేజీలో వైద్యులు అన్సారీని పరీక్షించి మృతి చెందినట్టుగా ప్రకటించారు. ఈ నెల 26న కడుపునొప్పి రావడంతో అన్సారీని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో 14 గంటలపాటు చికిత్స తీసుకున్న తర్వాత అన్సారీ తిరిగి జైలుకు వచ్చాడు.
గురువారం నాడు రాత్రి 08:25 గంటల సమయంలో వాంతులు అవుతున్నాయని ఫిర్యాదు రావడంతో అన్సారీని ఆసుపత్రికి తరలించారు. తొమ్మిది మంది వైద్యుల బృందం రోగికి అత్యవసర వైద్య సహాయం అందించారు. చికిత్స పొందుతూ అన్సారీ మృతి చెందారు. ఆసుపత్రి వర్గాలను ఉటంకిస్తూ అన్సారీ మృతిని పోలీసు అధికారులు ధృవీకరించారు.
అన్సారీ మృతితో మౌ, ఘాజీపూర్, బండా జిల్లాల్లో భద్రతను పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో స్థానిక పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ బృందాలను మోహరించారు.
అన్సారీ పరిస్థితి విషమించడంతో వైద్య కాలేజీలో చేరారని, సీపీఆర్ అందించిన తర్వాత మరణించినట్టుగా సీనియర్ అధికారి ప్రకటించారు.వారణాసి, తూర్పు ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతాల్లో బందోబస్తును పెంచినట్టుగా పోలీసులు ప్రకటించారు. సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని గ్యాంగ్‌స్టర్‌లలో అన్సారీ ఒకరు. అన్సారీపై నమోదైన కేసులో 2005లో అరెస్టయ్యారు. అప్పటి నుండి పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని వేర్వేరు జైళ్లలో శిక్షను అనుభవిస్తున్నాడు.
మౌ అసెంబ్లీ స్థానం నుండి ఐదు దఫాలు ఆయన ప్రాతినిథ్యం వహించారు. బీఎస్పీ తరపున తొలిసారిగా ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ ఆయనను పార్టీ నుండి బహిష్కరించింది. 2002, 2007లలో ఇండిపెండెంట్ గా ఆయన విజయం సాధించారు. 2012లో పార్టీ క్వామీ ఏక్తాదళ్ పార్టీ తరపున, 2017లో బీఎస్పీలో చేరి విజయం సాధించారు.అన్సారీపై 63 కేసులున్నాయి. 2022 సెప్టెంబర్ లో ఎనిమిది కేసుల్లో అన్సారీని కోర్టు దోషిగా నిర్ధారించింది. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసు కూడ ఉంది.