అన్ని బందాల్లో కెళ్లా వివాహ బంధం గొప్పదని పెద్దలు చెబుతుంటారు. ఆ బంధాన్ని కలకాలం నిలుపుకోవాలని ఎవరైనా చూస్తారు. కానీ ఓ మహిళ మాత్రం.. డబ్బు కోసం తన బంధాన్ని తాకట్టు పెట్టింది. కోటిన్నరకు కట్టుకున్న భర్తను అమ్మేసింది. ఈ సంఘటన భోపాల్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భోపాల్ ఫ్యామిలీ కోర్టుకు ఇటీవల ఒక కేసు వచ్చింది. ఒక బాలిక... తన తండ్రి అతని ఆఫీసులో పనిచేసే ఒక మహిళతో సంబంధం పెట్టుకుని, అమ్మతో తరచూ గొడవ పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో ఇంట్లో ప్రశాంతత కరువైందని మొరపెట్టుకుంది. ఈ కారణంగా తాను, తన చెల్లెలు చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నామని తెలిపింది. ఈ నేపధ్యంలో ఆ బాలిక తల్లిదండ్రులను ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు పిలిపించారు. ఆ బాలిక ఫిర్యాదు చేసిన విధంగానే తండ్రికి మరొక స్త్రీతో సంబంధం ఉందని వెల్లడైంది. పైగా అతను ఆ మహిళతోనే ఉండాలనుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. అయితే ఇందుకు అతని భార్య ఒప్పుకోలేదు.

ఈ సమస్య పరిష్కారం కోసం పలు దఫాలుగా కౌన్సెలింగ్ నిర్వహించారు. చివరకు సమస్యకు పరిష్కారం దొరికింది. అతని భార్య ఒక షరతుపై భర్తకు విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకుంది. తాను భర్తను ఆమెకు అప్పగించాలంటే ఆమె తనకు ఒక ఖరీదైన ఫ్లాట్‌తో పాటు రూ. 27 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అప్పుడే తన భర్తను ఆమెకు అప్పగిస్తారని స్పష్టం చేసింది. ఈ షరతుకు భర్త ప్రియురాలు ఒప్పుకున్నట్లు సమచారం. ఈ సందర్భంగా అతని భార్య మాట్లాడుతూ పెళ్లయి ఇన్నేళ్లు గడచిన తరువాత తన భర్త ఇలా ప్రవర్తించడం తనకు నచ్చలేదని అన్నారు. అయితే తన పిల్లల భవిష్యత్ దృష్ట్యా తాను డబ్బులు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.