సాధారణ మహిళలకే కాదు... ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలకు కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదనడానికి ఇదో ఉదాహరణ. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియా సులే లైంగిక వేధింపులకు గురయ్యారు. ట్యాక్సీ కావాలా అంటూ ఓ డ్రైవర్ ఆమెను లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ లో తెలియజేశారు.

కుల్జీత్‌ సింగ్‌ మల్హోత్రా అనే వ్యక్తి తన రైల్వే బోగీలోకి వచ్చి ట్యాక్సీ సర్వీస్‌ గురించి ప్రచారం చేసుకున్నాడని, తనకు ట్యాకీ​అవసరం లేదని చెప్పినా వినిపించుకోకుండా తన వెంటపడుతూ తనతో ఫోటో కూడా తీసుకున్నాడని, అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె దాదర్‌ స్టేషన్‌లో రైల్వే అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎంపీ ఫిర్యాదుతో మల్హోత్రాను అదుపులోకి తీసుకున్న అధికారులు నిందితుడికి జరిమానా విధించారు. రైల్వే అధికారులు ఈ ఘటనపై దృష్టిసారించి ప్రయాణీకులకు ఇలాంటి అనుభవం మరోసారి ఎదురవకుండా చర్యలు తీసుకోవాలని, ఆటో డ్రైవర్లు తమ సేవలపై ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఉంటే రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో అందుకు అనుమతించరాదని, ట్యాక్సీ స్టాండ్స్‌కే వాటిని పరిమితం చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌ చేశారు.

ట్యాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని అతనికి జరిమానా విధించామని రైల్వే పోలీసులు వివరించగా వారికి సుప్రియా ధన్యవాదాలు తెలిపారు. ఏ ఒక్కరి వల్ల రైల్వే ప్రయాణీకులకు అసౌకర్యం వాటిల్లరాదని ఆమె పేర్కొన్నారు.