దాద్రానగర్‌ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ రెండు రోజుల క్రితం ఓ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం నివేదిక కూడా ఎంపీది ఆత్మహత్యగా నిర్ధారించింది. దీంతోపాటు ఘటనా స్థలంలో పోలీసులకు 15 పేజీల సూసైడ్‌ నోట్‌ లభించింది. 

ఎంపీ అధికారిక లెటర్ హెడ్ మీద గుజరాతీలో ఉన్న ఈ లేఖలో ఎంపీ తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించినట్లు సమాచారం. అయితే లేఖలో ఉన్న విషయాలు గురించి పోలీసులు బయటకు వెల్లడించడం లేదు. 

కాగా, సోమవారం ఉదయం సౌత్ ముంబైలోని ఓ హోటల్ గదిలో ఎంపీ మోహన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం డ్రైవర్ వచ్చి రూమ్ తలుపు కొట్టగా ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో డ్రైవర్ ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వాళ్లు హోటల్ సిబ్బందికి విషయం చెప్పమని సూచించారు. డ్రైవర్ హోటల్ స్టాఫ్ కి విషయం చెప్పాడు. 

ఆ తర్వాత డ్రైవర్ బాల్కనీలోని గదిలోకి ప్రవేశించి చూస్తే.. అక్కడ సీలింగ్‌ ఫ్యాన్‌కు ఎంపీ మోహన్ ఉరి వేసుకుని ఉండటం కనిపించింది. ఇది గమనించిన వెంటనే డ్రైవర్‌ పోలీసులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం మోహన్‌ దేల్కర్‌ డ్రైవర్‌, బాడీగార్డును పోలీసులు విచారిస్తున్నారు. 

అయితే సంచలనం సృష్టించిన ఎంపీ మోహన్ ఆత్మహత్య తరువాత గతేడాది అతడు లోక్‌సభలో ప్రసంగించిన ఓ వీడియో తెగ వైరలయ్యింది. ఈ వీడియోలో మోహన్.. ‘‘గత నాలుగు నెలలుగా కొందరు అధికారులు నన్ను అవమానించాలని, నాపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారు. 

కరోనా టైంలో కొంతమంది అధికారులు నన్ను తప్పుడు కేసుల్లో బుక్ చేయాలని ప్రయత్నించారు. నా విధుల్ని నిర్వర్తించడానికి నన్ను అనుమతించలేదు. దీనివల్లే నేను ప్రజలకు సాయం చేయలేకపోయాను. కేంద్ర పాలిత దాద్రా, నగర్ హవేలీల ముక్తి దివాస్ సందర్భంగా నన్ను అవమానించారు. 

35 సంవత్సరాలుగా వస్తోన్న సంప్రదాయం ప్రకారం దాద్రానగర్ హవేలీ ప్రజలను ఉద్దేశించి నేను ప్రసంగించకుండా అడ్డుకున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించడానికి నన్నెందుకు అనుమతించలేదని నేను అడిగితే.. డిప్యూటీ కలెక్టర్, ఈవెంట్ నిర్వాహకులు నాతో అసభ్యంగా ప్రవర్తించారు. వారు నన్ను లక్ష్యంగా చేసుకున్నరు. ఇది నాపై జరుగుతున్న కుట్ర" అని మోహన్ ఈ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.