మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది. తల్లి శవాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి ఆ ప్రభుత్వ హాస్పిటల్ వాహన సేవలను అందించలేదు. ప్రైవేటు వాహనానికి డబ్బు చెల్లించే స్తోమత లేదు. దీంతో వారు ఓ చెక్కపై శవాన్ని కట్టేసి బైక్ పై తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది. 

భోపాల్: మధ్యప్రదేశ్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కన్న తల్లి శవాన్ని ఇంటికి తీసుకెళ్లలేక ఓ కొడుకు అష్టకష్టాలు పడ్డాడు. గవర్నమెంట్ హాస్పిటల్‌ సిబ్బందిని శవాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి వాహనం అరేంజ్ చేయాలని కోరినా ఫలితం లేకపోయింది. ప్రైవేటులో వాహనానికి రూ. 5 వేలు పెట్టే స్తోమత ఆయన దగ్గర లేవు. వెళ్లాల్సిన ఊరు 80 కిలోమీటర్ల ఆవల ఉన్నది. తలబద్ధలైపోతున్నంత వేదన.. తొలిచివేస్తున్న ఆక్రందన. దీంతో రూ. 100 పెట్టి ఓ బల్లపరుపు చెక్క కొన్నాడు. ఆ చెక్కకు తల్లి శవాన్ని కట్టేశాడు. ఆ చెక్కకు కట్టిన తల్లి శవాన్ని తన ద్విచక్ర వాహనంపై పదిలంగా పెట్టుకుని స్వగ్రానికి బరువైన ప్రయాణం మొదలుపెట్టాడు. బైక్ పై ఆయన తన తల్లి శవాన్ని తీసుకెళ్లుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్టు అయింది. 

ఒకే సిరంజీతో 30 మందికి టీకా వేసిన ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. అనుప్పూర్ జిల్లా గుడారు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. తన తల్లికి ఛాతిలో నొప్పి రావడంతో 80 కిలోమీటర్ల దూరంలోని షాహదోల్ జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు.

ఆ హాస్పిటల్‌లో తన తల్లిని అడ్మిట్ చేసుకున్నారు. కానీ, చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఆమెకు సరైన చికిత్స అందించలేదని ఆ వ్యక్తి, ఆయన మిత్రుడు ఆరోపించారు. ఈ విషయమై వారు నర్సులు, వైద్యులతో వాగ్వాదానికి దిగారు.

Scroll to load tweet…

అనంతరం, తల్లి మృతదేహాన్ని స్వగ్రామమైన గుడారుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ ప్రభుత్వ హాస్పిటల్‌ను శవ వాహన సేవలు అందించాలని కోరారు. కానీ, హాస్పిటల్ సిబ్బంది నిరాకరించారు.

దీంతో ప్రైవేటు వాహనం కోసం ప్రయత్నించాడు. 80 కిలోమీటర్లు శవాన్ని మోసుకెళ్లడానికి వాహనదారులు రూ. 5000 డిమాండ్ చేశారు. ఆ మొత్తం చెల్లించే స్తోమత వారికి లేదు. చేసేదేమీ లేక రూ. 100 పెట్టి ఓ బల్లపరుపు చెక్కను కొనుగోలు చేశారు. ఆ చెక్కకు తల్లి మృతదేహాన్ని కట్టేశారు. ఆ మృతదేహాన్ని బండిపై వారి మధ్యలో ఉంచి ప్రయాణించారు.