స్కూలుకు వెళ్లకపోతే చచ్చిపోతానంటూ కొడుకును బెదిరించాలనుకున్న ఓ తల్లి ఉరివేసుకోబోయింది. తాడు గొంతుకు బిగుసుకుపోయి మృతి చెందింది.
చెన్నై : తమిళనాడులోని చెన్నైలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. కొడుకు స్కూలుకు వెళ్లడం లేదని.. బెదిరించాలని అనుకుంది ఓ తల్లి. దీని కోసం కొడుకు స్కూలుకు వెళ్లకపోతే ఉరివేసుకుంటానంటూ భయపెట్టాలని చూసింది. అలా ఉరి వేసుకునే క్రమంలో నిజంగానే ఉరి గొంతుకు బిగుసుకుపోయి చనిపోయింది. ఈ ఘటన కోయంబత్తూరులోని దుప్పాలయం- చిరుముగై రోడ్డులోని ఓ కుటుంబంలో వెలుగు చూసింది.
అక్కడ నివసించే ఓ దంపతులు సుధాకర్, యమునా బాబు (34)... వీరికి ఇద్దరు సంతానం. కొడుకు (16), కూతురు (14). వీరిద్దరిని తమ నివాసానికి దగ్గరలో ఉన్న స్కూల్లో చదివిస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు10వ తేదీ ఉదయం కొడుకు తనకు స్కూలుకు వెళ్లడం ఇష్టం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఎంతగా సముదాయించినా ఒప్పుకోలేదు.
దీంతో ఏం చేయాలో పాలు పోని యమునా బాబు కొడుకును భయపెట్టాలనుకుంది. అందుకోసం ఉరివేసుకొని చచ్చిపోతా అంటూ బెదిరించింది. ఆ ప్రకారమే గదిలోకి వెళ్లి.. తాడు బిగించి స్టూల్ మీద నిలబడింది. మెడకు తాడు తగిలించుకొని బెదిరించబోయింది. ఇంతలో ఆమె కాలు జారి తాడు మెడకు గట్టిగా బిగుసుకుపోయింది.
కొడుకు ఇది చూసి భయపడిపోయాడు. వెంటనే ఇరుగు పొరుగు వారికి చెప్పాడు.వెంటనే పరిగెత్తుకొచ్చిన ఇరుగుపొరుగువారు తలుపులు పగలగొట్టి యమునా బాబును కిందికి దింపారు. అప్పటికే ఆమె గొంతుకు తీవ్రంగా తాడు బిగుసుకుపోయింది. వెంటనే రక్షించి మెట్టుపాళయం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తుండగా శనివారం ఆమె మృతి చెందింది.
