ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. తన ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఆగ్రా సమీపంలోని ఫాతేబాద్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల వివాహిత ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ముగ్గురు పిల్లలతో కలిసి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

పోలానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన ఆత్త, ఆడపడుచు ఆమెను చూసి చుట్టుపక్కల వారి సాయంతో ఫ్యాన్ నుంచి కిందకు దించారు. అయితే వారు అప్పటికే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, మహిళ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి ఆమె భర్త, మావయ్య కనిపించకపోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి.