కొడుకు బైక్ తగలబెట్టడానికి కిరాయి గూండాలను నియమించిన తల్లి.. తల్లిపైనే దాడి చేసిన దుండగులు..
కొడుకు బైక్‌కు నిప్పు పెట్టేందుకు గూండాలను ఉసిగొలిపిందో మహిళ. కానీ ఆ గూండాలు ఆమె మీదే దాడికి దిగారు. డబ్బులు పేమెంట్ విషయంలో గొడవే కారణమని అనుమానాలు వ్యక్తం అవతున్నాయి.

కేరళ : తానొకటి అనుకుంటే దైవం ఒకటి తలిచిందని ఓ మహిళ విషయంలో ఇది సరిగ్గా జరిగింది. కేరళలోని మలప్పురంలో ఆదివారం ఓ మహిళ తన కుమారుడి మోటర్‌బైక్‌కు నిప్పంటించడానికి నియమించిన గూండాలు ఆమె మీదే దాడికి పాల్పడ్డారు. గూండాలు ఆమె ఇంటిని కూడా ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు.
నఫీసా అనే మహిళకు తన కుమారుడితో కుటుంబ కలహాలు ఉన్నాయి. తల్లీ కొడుకుల మధ్య ఈ విభేదాలు కారణంగా, ఆమె గతంలో అతని కోసం కొనిచ్చిన మోటర్‌బైక్‌ను తిరిగి ఇవ్వమని కోరింది. దీనికి కొడుకు నిరాకరించాడు. దీంతో నఫీసా బైక్‌ను తగులబెట్టడానికి కిరాయికి వ్యక్తులను నియమించింది.
అయితే, ఆ తర్వాత గూండాలు నఫీసాపై దాడి చేసి ఆమె ఇంటిని ధ్వంసం చేశారు. నఫీసా చెల్లించాల్సిన డబ్బుల విషయంలో తలెత్తిన విభేదాల కారణంగానే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. దీంతో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.