ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్‌లకు వార్నింగ్.. అసభ్య పోస్టులను ఉపేక్షించం: కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్
కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సామాజిక మాధ్యమాలు ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్‌లకు వార్నింగ్ ఇచ్చారు. ఆ సైట్‌లలో అసభ్యకర, హానికారక కంటెంట్ లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను విస్మరించినా.. అమల చేయడంలో జాప్యం వహించినా సెక్షన్ 79 కింద ఇంటర్మిడరీలుగా వాటికి సంక్రమించిన భద్రతను తొలగిస్తామని హెచ్చరించారు.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సామాజిక మాద్యమాలు ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్‌లకు వార్నింగ్ ఇచ్చారు. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్‌ను వెంటనే వాటి వేదికలపై నుంచి తొలగించాలని, ఇండియా ఇంటర్నెట్‌లో ఈ కంటెంట్‌కు చోటులేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపారు.
ఆ వేదికలపై చైల్డ్ సెక్సువల్ అబ్యూజల్ మెటీరియల్‌ను భారత ఇంటర్నెట్ నుంచి వెంటనే తొలగించాలని ఆ నోటీసుల్లో నొక్కి చెప్పారు. అలాగే, అలాంటి కంటెంట్ ఆ సైట్‌లలో కనిపించకుండా, భవిష్యత్‌లోనూ పోస్టు కాకుండా చర్యలు తీసుకోవాలని, ఒక వేళ పోస్టు చేసినా వెంటనే రిపోర్ట్ చేసే మెకానిజం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
ఈ నిబంధనలు పాటించని సంస్థలు ఐటీ రూల్స్ 2021లోని రూల్ 3(1)(బీ), రూల్ 4(4)లను ఉల్లంఘించినట్టుగానే పరిగణిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు అమలు చేయడంలో జాప్యం చేసిన సంస్థలపై చర్యలు తీసుకుంటామని, ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 79 కింద వాటికి దక్కే భద్రతను ఎత్తేస్తామని తెలిపింది.
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘మేం ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్‌లకు నోటీసులు పంపాం. ఆ సైట్‌లలో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ లేకుండా చూసుకోవాలని ఆదేశించాం. ఐటీ రూల్స్ కింద భారత ఇంటర్నెట్‌ను సురక్షితమైన, నమ్మకమైనదిగా నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. నేరపూరిత, హానికారక కంటెంట్ ఆ సైట్‌లలో పోస్టు కాకుండా చూసుకోవాలని ఈ మూడు సోషల్ మీడియా సంస్థల నుంచి తాము ఆశిస్తున్నాం. అలాంటి వాటికి ఆ సంస్థలు చురుకుగా స్పందించి చర్యలు తీసుకోకుంటే సెక్షన్ 79 కింద వాటికి కల్పించిన భద్రతను ఉపసంహరిస్తాం. తద్వార భారత చట్టం కింద తదుపరి పరిణామాలను ఆ సంస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని వివరించారు.
Also Read: ఇండియాలోని కుటుంబాన్ని కలిసిన పాకిస్తాన్ బౌలర్ హసన్ అలీ భార్య సామియా
భారత అంతర్జాలంలో హానికారక పోస్టులను తొలగించే విషయంపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కృషి చేస్తున్నారు.
ఐటీ యాక్ట్ 2000 పోర్నోగ్రఫిక్ కంటెంట్, చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్‌కు సంబంధించి లీగల్ ఫ్రేమ్ వర్క్‌ను అందిస్తున్నది. సెక్షన్లు 66ఈ, 67, 67ఏ, 67బీలు అలాంటి కంటెంట్ కలిగి ఉన్న వేదికలపై కఠిన చర్యలకు, పెనాల్టీలకు ఆదేశిస్తాయి.