కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బెంగళూరులో జరిగిన జీ 20 డిజిటల్ ఎకనామీ వర్కింగ్ గ్రూప్ నాలుగో సమావేశాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నాలుగు దేశాల మంత్రిస్థాయి ప్రతినిధులతో ఆయన శుక్రవారం ద్వైపాక్షి సమావేశాలు నిర్వహించారు.
బెంగళూరు: కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్షిప్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నాలుగు దేశాల మంత్రులతో విడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జీ 20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ నాలుగో సమావేశాలు శుక్రవారం బెంగళూరులో జరిగాయి. ఇందులో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, టర్కీ దేశాల మంత్రులతో చర్చించారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇండియా స్టాక్, కృత్రిమ మేధస్సు, నైపుణ్యాభివృద్ధి, సైబర్‌సెక్యూరిటీ అంశాలపై ఈ దేశాలతో ఆయన మాట్లాడారు. భావి సాంకేతిక అభివృద్ధి కొన్ని దేశాల చేతులకే పరిమితం కారాదని, అన్ని దేశాల పాత్ర అందులో ఉండాలని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఇండియా స్టాక్ పౌరుల జీవితాలను మార్చివేసిందని, ప్రభుత్వానికి, డిజిటల్ నాగరికులకు మధ్య విశ్వాసాన్ని నెలకొల్పిందని తెలిపారు. తమ ఆర్థిక వ్యవస్థలను, పాలనను డిజిటైజ్ చేయాలనుకునే దేశాలకు ఇండియా స్టాక్‌ను ఆఫర్ చేస్తున్నామని చెప్పారు.
బంగ్లాదేశ్ ఐసీటీ స్టేట్ మినిస్టర్ హెచ్ఏ జునైద్ అహ్మద్ పాలక్‌తో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇండియా స్టాక్, సైబర్ సెక్యూరిటీ, స్కిల్లింగ్‌కు సంబంధించి కలిసి పనిచేసే బలమైన అవకాశాలపై చర్చించారు. ఇండియా, బంగ్లాదేశ్‌ల మధ్య భాగస్వామ్యం దక్షిణాసియా ముఖచిత్రాన్ని మార్చివేసే శక్తి గలవని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.

ఫ్రాన్స్ డిజిటల్ అఫైర్స్ మినిస్ట్రీ అంబాసిడర్ హెచ్ఈ హెన్రీ వర్డియర్‌తో జరిగిన భేటీలో కృత్రిమ మేధస్సుతో ప్రజా జీవితాల్లో వస్తున్న మార్పులపై లోతుగా చర్చించారు. ఏఐలో తమ దేశం ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నదని కేంద్రమంత్రి అన్నారు. ఇండియా స్టాక్ వంటి డీపీఐలతో ప్రభుత్వాన్ని, ఆర్థిక వ్యవస్థను డిజిటైజ్ చేయాలనుకునే దేశాలకు సహాయం చేయడానికి భారత్, ఫ్రాన్స్ వంటి భావసారూప్య దేశాలకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
Also Read: 10 ఏళ్లలో మూడు రెట్లు పెరిగిన భారత ప్రజల సంపాదన: మోడీ
కొన్ని దేశాలే టెక్నాలజీకి రూపు ఇవ్వరాదని, అందులో ఇతర దేశాలనూ సంఘటితం చేసుకోవాలని టర్కీ ఇండస్ట్రీ, టెక్నాలజీ మినిస్టర్ హెచ్ఈ మెహ్మెత్ ఫతీహ్ కాసిర్‌తో ద్వైపాక్షిక భేటీలో కేంద్రమంత్రి అన్నారు.
చివరిగా దక్షిణ కొరియా ఐసీటీ, సైన్స్ మినిస్ట్రీ డిప్యూటీ మినిస్టర్ డాక్టర్ జిన్ బే హోంగ్‌తో జరిగిన సమావేశంలో ఉభయ దేశాల మధ్య గల బలమైన సంబంధాలపై చర్చించారు. ఈ రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ప్రపంచం మొత్తం మీద బలమైన ప్రభావం చూపగలదని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
ఈ సమావేశాల తర్వాత కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సాయంత్రం తిరిగి ఢిల్లీకి వెళ్లారు.
