వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే స్వామి చక్రపాణి మహారాజ్.. చంద్రుడికి హిందూ రాష్ట్రంగా పేరు పెట్టాలని సూచించారు. వెంటనే దీనిపై పార్లమెంట్ లో చట్టం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.
చంద్రయాన్ -3 మిషన్ చంద్రుడిపై దిగిన ప్రాంతాన్ని శివశక్తి పాయింట్ గా పిలవాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అయితే ఈ పేరుపై రెండు రోజుల పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిని అధికార బీజేపీ తిప్పికొడుతోంది. దీనిపై ఇలా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో చంద్రుడిని ‘హిందూ రాష్ట్రం’గా ప్రకటించాలని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ డిమాండ్ చేశారు.
అలాగే చంద్రుడిపై ఉన్న శివశక్తి పాయింట్ ను హిందూ రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలని కూడా కోరారు. చంద్రుడిపై వివిధ భావజాలాలు కలిగిన వ్యక్తులు 'ఘజ్వా-ఎ-హింద్'ను ప్రకటించడానికి ముందే ఈ పని చేయాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో ఓ వీడియో పోస్టు పెట్టాడు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.
‘‘పార్లమెంటు చంద్రుడిని సనాతన దేశంగా ప్రకటించాలి. చంద్రయాన్ 3 ల్యాండింగ్ కు గుర్తుగా శివశక్తి పాయింట్ ను చంద్రుడి రాజధానిగా ప్రకటించాలి. మరే ఇతర భావజాలం అక్కడకు చేరకుండా ఇలా చేయాలి’’ అని ఆ వీడియోలో స్వామి చక్రపాణి కోరారు.
కాగా.. స్వామి చక్రపాణికి విచిత్రమైన వ్యాఖ్యలు, పనులు చేయడం ఇప్పుడు కొత్తేమీ కాదు. 2020 లో దేశం కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్న సమయంలో ఆయన దేశ రాజధానిలో ‘‘గౌమూత్ర పార్టీ’’ నిర్వహించారు. అందులో ఆయన, ఇతర అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు కరోనాను నివారించేందుకు ఆవు మూత్రం తాగారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ నాయకులు భారతదేశం నుండి ఆవు మూత్రాన్ని దిగుమతి చేసుకోవాలని సూచించారు. ఎందుకంటే భారతీయ ఆవులో మాత్రమే సర్వశక్తిమంతుడు ఉంటాడు ఏ విదేశీ జాతిలోనూ ఉండరని అన్నారు. అలాగే 2018లో కేరళలో వరదల సమయంలోనూ స్వామి చక్రపాణి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. రాష్ట్రంలో గొడ్డు మాంసం తినే వారికి ఎలాంటి సహాయం అందకూడదని అన్నారు. బీఫ్ తినేవారిని కాపాడటం పాపం అని తెలిపారు.
