monkeypox: దేశరాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో ఢిల్లీలో నమోదైన మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. మంకీపాక్స్ అనుమానిత కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ.. నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.
monkeypox India: కరోనా వైరస్ ప్రభావం నుంచి కోలుకుంటున్న ప్రపంచ దేశాలను ప్రస్తుతం మరో వైరస్ కలవరానికి గురిచేస్తున్నది. అదే మంకీపాక్స్. కేవలం ఆఫ్రికా దేశాలకు మాత్రమే పరిమితమై ఉండే మంకీపాక్స్ కేసులు.. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాలకు వ్యాపించాయి. కొన్ని దేశాల్లో ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు పెరుగుతున్నాయి. భారత్ లోకి గతనేలలో ప్రవేశించిన మంకీపాక్స్.. ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తోంది. బుధవారం నాడు భారత్ లో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. నైజీరియన్ మహిళకు మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో.. పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా వచ్చింది. మంకీపాక్స్ బారినపడ్డ సదరు 31 ఏళ్ల నైజీరియన్ మహిళతో కలిపి భారతదేశంలో మొత్తం మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ల సంఖ్య ఇప్పుడు తొమ్మిదికి చేరుకుంది.
31 ఏళ్ల నైజీరియన్ మంకీపాక్స్ పాజిటివ్ పరీక్షించిన తర్వాత ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రిలో చేరారు. అంతకుముందు రాజధానిలో మరో నైజీరియన్ జాతీయుడు జూనోటిక్ వ్యాధి బారిన పడ్డాడు. రోగులిద్దరికీ ఇటీవల ప్రయాణాలు చేసిన చరిత్ర లేదని సమాచారం. ఢిల్లీలో మంకీపాక్స్ కేసుల పెరుగుదలతో ధృవీకరించబడిన, అనుమానిత కేసుల కోసం ఐసోలేషన్ వార్డులను సృష్టించే మూడు ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వం గుర్తించింది . ఆ మూడు ఆసుపత్రుల్లో MD సిటీ హాస్పిటల్, బాత్రా హాస్పిటల్, కైలాష్ దీపక్ హాస్పిటల్ లు ఉన్నాయి. మంకీపాక్స్ కేసుల ఐసోలేషన్‌ను నిర్వహించడానికి ఒక్కొక్కటి 10 పడకలు రిజర్వ్ చేస్తాయని అధికారులు తెలిపారు.
భారత్ లో ఇప్పటివరకు వెలుగుచూసిన 9 మంకీపాక్స్ కేసుల్లో నాలుగు దేశరాజధాని ఢిల్లీలోనే నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మంకీపాక్స్‌ను గుర్తించడానికి నమూనాలను పరీక్షించడం ప్రారంభించింది. ICMR-NIV NCDCతో సహా దేశవ్యాప్తంగా 15 ప్రయోగశాలల నెట్‌వర్క్‌తో రియాజెంట్లను పంచుకుంటుంది. దేశంలో మంకీపాక్స్ మొదటి కేసు దక్షిణాది రాష్ట్రమైన కేరళలో నమోదైంది. జూలై 14 మంకీపాక్స్ కేసు వెలుగులోకి రాగా.. సదరు రోగి గతవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని అధికారులు తెలిపారు. కేరళలోని ఐదుగురు మంకీపాక్స్ రోగులకు UAE ప్రయాణ చరిత్ర ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం.. మంకీపాక్స్ అనేది ఒక వైరల్ జూనోసిస్ (జంతువుల నుండి మానవులకు సంక్రమించే వైరస్). మశూచి రోగులలో గతంలో కనిపించిన లక్షణాలను పోలి ఉంటుంది.అయితే, ఇది వైద్యపరంగా తక్కువ తీవ్రతతో ఉంటుంది.
కేవలం ఆఫ్రికా దేశాలకు మాత్రమే పరిమితమైన ఉన్న మంకీపాక్స్ కేసులు ప్రస్తుతం ఇతర దేశాలకు వ్యాపించడం.. పలు దేశాల్లో ఆందోళనకరంగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఆయా పరిస్థితుల నేపథ్యంలో మంకీపాక్స్ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ క్రమంలోనే భారత్ లో జూలై 14న కేరళలో మొదటి మంకీపాక్స్ కేసు నమోదైన తర్వాత కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. నూతన మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. మంకీపాక్స్ సంబంధిత లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానికంగా ఉన్న యంత్రాంగానికి సమాచారం అందించాలని సూచించింది.
