Mohammed Zubair Case: ప్రముఖ ఫ్యాక్ట్‌చెకర్‌ ముహమ్మద్‌ జుబేర్‌ అరెస్ట్ విష‌యంలో జర్మనీ విమర్శలకు భారత్‌ ధీటైన సమాధానం ఇచ్చింది. ఆ విష‌యం భార‌త‌ అంతర్గత వ్యవహారమ‌నీ, ప్రస్తుతం ఆ విషయం న్యాయస్థానంలో ఉన్నందున దానిపై కామెంట్లు సరికాదని విదేశాంగ కార్యదర్శి అరిందమ్‌ బాగ్చి, జర్మనీ కామెంట్లకు బదులిచ్చారు.

Mohammed Zubair Case: ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్, ఫాక్ట్ చెకర్ మహ్మద్ జుబైర్ అరెస్టుపై జర్మనీ చేసిన‌ విమర్శల‌ను భారత్ తోసిపుచ్చింది, ఆ విమ‌ర్శ‌ల‌కు భారత్‌ ధీటైన సమాధానమిచ్చింది. దేశ న్యాయ వ్యవస్థ స్వతంత్రత అందరికీ తెలుసునని, వాస్తవాలు తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేయ‌రాద‌ని భార‌త్ పేర్కొంది. భారత ప్రభుత్వ తీరును జర్మనీ విదేశాంగ శాఖ తప్పుబట్ట‌డంపై భారత్‌ గట్టిగానే స‌మాధాన‌మిచ్చింది.

జర్నలిస్టులు ఏం మాట్లాడినా, రాసినా హింసించరాదని, వారిని జైల్లో పెట్టవద్దని జుబైర్‌పై పోలీసు చర్య నేపథ్యంలో జర్మనీ విదేశాంగ శాఖ విమర్శించింది. దీనిపై భార‌త విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం స్పందించారు.

పత్రికా స్వేచ్ఛపై జర్మనీ విమ‌ర్శ‌లు

ఫ్రీ రిపోర్టింగ్ ఏ సమాజానికైనా ప్రయోజనకరమని, దానిని నిషేధించడం ఆందోళన కలిగించే అంశమని జర్మన్ విదేశాంగ మంత్రిత్వ ప్రతినిధి అన్నారు. జ‌ర్న‌లిస్టులు ఏం మాట్లాడినా.. వారు ఏం చెప్పినా.. వాస్త‌వాల‌ను వెలుగులోకి తీసుకవ‌చ్చినందున వారిని హింసించకూడదనీ, వారిని జైలులో పెట్టకూడదనీ అన్నారు. జుబైర్‌ అరెస్ట్‌ను ప్రస్తావిస్తూ.. ఈ విషయం త‌మ‌కు తెలుసున‌నీ, న్యూఢిల్లీలోని మా(జ‌ర్మ‌నీ) రాయబార కార్యాలయం దీనిని నిశితంగా పరిశీలిస్తోందని జర్మనీ విదేశాంగ మంత్రిత్వ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది.

భార‌త విదేశాంగ కార్యదర్శి అరిందమ్‌ బాగ్చిమాట్లాడుతూ.. “ఇది అంతర్గత సమస్య. ఈ అంశం న్యాయస్థానంలో ఉంది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశంపై వ్యాఖ్యానించడం సముచితం కాదు. ఈ విష‌యం ప్ర‌స్తుతానికి మీక‌న‌వ‌స‌రమ‌ని నొక్కి చెప్పాలనుకుంటున్నాను."అని అన్నారు.

భార‌త దేశ న్యాయవ్యవస్థ స్వతంత్రత అందరికీ తెలిసిందేనని, వాస్తవాలు తెలుసుకోకుండా చేసే వ్యాఖ్యలు పనికిరానివని, వాటిని మానుకోవాలని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో, జర్మన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వ్యాఖ్యలపై స్పందించాలని బాగ్చీని కోరారు.

ఇదిలా ఉంటే.. మానవ హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛపై భారత్‌తో యూరోపియన్ యూనియన్ (ఈయూ) చర్చలు జరుపుతోందని జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. “భారత్ తనను తాను ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అభివర్ణించుకుంటుంది. కాబట్టి భావప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ వంటి ప్రజాస్వామ్య విలువలకు తగిన స్థానం ఇవ్వాలని పేర్కొన్నారు. వెబ్‌సైట్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు జుబైర్‌ను 2018 "అభ్యంతరకరమైన ట్వీట్" కోసం ఢిల్లీ పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు.