మోడీ ఇంటిపేరు వివాదంలో రాహుల్ గాంధీకి మరో సమన్లు అందాయి. బీహార్ లోని పట్నా కోర్టు ఈ మేరకు ఏప్రిల్ 25న హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.  

బీహార్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో సమన్లు అందాయి. ‘మోడీ ఇంటి పేరు’ వ్యాఖ్యల వివాదం ఆయనను వదిలేట్టు లేదు. ఈ వివాదంతో రాహుల్ గాంధీకి మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఈ వ్యాఖ్యల మీద బీహార్ లో కూడా ఆయనపై పరువు నష్టం కేసు నమోదయింది. పాట్నా కోర్టు ఆ కేసులో విచారణకు రావాలని రాహుల్ గాంధీకి తాజాగా సమాన్లు జారీ చేసింది. ఏప్రిల్ 25వ తేదీన ఈ కేసులో విచారణకు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

రాహుల్ పై ఈ పరువు నష్టం దావాను బిజెపి రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోది వేశారు. పట్నాలోని ఎంపీ/ ఎమ్మెల్యే కోర్టు గతంలో దీని మీద విచారణ జరిపింది. అప్పుడే ఏప్రిల్ 12న రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఆ సమయంలో రాహుల్ గాంధీ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు మీద అప్పీల్ వ్యవహారంలో ప్రస్తుతం తమ బిజీగా ఉన్నందున విచారణను వాయిదా వేయాలని రాహుల్ గాంధీ తరపు న్యాయవాదుల బృందం కోర్టును కోరింది. దీనికి న్యాయస్థానం అంగీకరించింది. ఈ విచారణను ఏప్రిల్ 25వ తేదీకి వాయిదా వేసింది.

Karnataka Election 2023: ‘హిజాబ్’ ఆందోళన చేసిన బీజేపీ ఎమ్మెల్యేకు టికెట్ తిరస్కరణ.. మీడియా ముందు ఏడ్చేశారు!

అంతేకాదు ఆరోజు రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా సమన్లు జారీ చేసింది. 2019 ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని కోలార్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. లలిత్ మోదీ, నీరవ్ మోదీల మీద ఈ వ్యాఖ్యలు చేశారు. వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు వీరిద్దరూ. ఆ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోదీ అనే పేరు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్ని తప్పుపడుతూ గుజరాత్ లోని సూరత్ లో రాహుల్ గాంధీ మీద పరువు నష్టం దావా దాఖలు అయింది.

దీనిమీద ఇటీవల విచారణ జరిగిన సంగతి తెలిసిందే. సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనల మేరకు లోక్సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు కూడా వేసింది. ఆయన లోక్సభ సభ్యత్వం రద్దు అయ్యింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ సూరత్ కోర్టు తీర్పుపై పైకోర్టులో ఆపిల్ చేసుకున్నారు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం ఏప్రిల్ 13 గురువారం అంటే ఈరోజు విచారణ జరపనుంది.