కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలనుకున్న ఉడుపి ఎమ్మెల్యే రఘుపతి భట్‌కు బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన ప్రరెస్ మీట్ పెట్టి బాధపడుతూ ఏడ్చేశారు. హిజాబ్ ఆందోళనలతో ఈ ఎమ్మెల్యే వార్తల్లో నిలిచారు.
బెంగళూరు: ఉడుపి బీజేపీ ఎమ్మెల్యే రఘుపతి భట్ మళ్లీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో బుధవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూనే ఆయన ఏడ్చేశారు. తన పట్ల పార్టీ నడుచుకున్న విధానం తనను బాధించిందని అన్నారు. హిజాబ్ ధరించి ముస్లిం పిల్లలు తరగతి గదిలోకి వెళ్లకుండా అడ్డుకున్న ఆందోళనలతో ఈ ఎమ్మెల్యే గ్లోబల్ హెడ్‌లైన్స్‌లోకి ఎక్కిన విషయం తెలిసిందే.
పార్టీ తీసుకున్న నిర్ణయంతో తాను బాధపడటం లేదని ఆయన తెలిపారు. అయితే, పార్టీ తనను ట్రీట్ చేసిన విధానం పై బాధపడుతున్నట్టు వివరించారు. మీడియాతో మాట్లాడుతూనే ఆయన ఏడ్చేశారు.
పార్టీ తనకు టికెట్ ఇవ్వడం లేదని తనకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని ఆయన బాధపడ్డారు. కనీసం జిల్లా అధ్యక్షుడైనా ఫోన్ చేసి తనకు చెప్పలేదని అన్నారు. టీవీ చానెళ్లలో వార్త చూసిన తర్వాత తనకు టికెట్ ఇవ్వలేదనే విషయాన్ని తెలుసుకున్నట్టు ఆయన వివరించారు.
‘జరుగుతున్న మార్పుల గురించి జగదీశ్ షెట్టర్‌కు అమిత్ షా నేరుగా ఫోన్ చేసి వివరించాడు. నాకు అమిత్ షా ఫోన్ చేయాలనేమీ అనుకోవడం లేదు. కనీసం జిల్లా అధ్యక్షుడైనా ఫోన్ చేసి పార్టీ నిర్ణయాన్ని చెప్పాల్సింది కదా. కేవలం నా కులం చూసే నాకు పార్టీ టికెట్ తిరస్కరిస్తే మాత్రం దాన్ని అంగీకరించను’ అని రఘుపతి భట్ తెలిపారు.
Also Read: అది మిరాకిల్ కాదు.. నర్మదా నదిపై మహిళ నడిచిన వీడియో ఫ్యాక్ట్ చెక్.. అసలేం జరిగిందంటే?
అలుపు లేకుండా నిరంతరం పని చేసే వారు బీజేపీకి అవసరం లేదేమో అని భట్ అన్నారు. పార్టీ ఎక్కడకు వెళ్లిన వృద్ధిలోకి వస్తున్నది కాబట్టి.. తనలాంటి వారు అవసరం లేదని పార్టీ భావిస్తున్నదేమో అని వివరించారు. కఠిన సమయాల్లోనూ తాను పార్టీ కోసం పని చేసినట్టు తెలిపారు. తనకు ఇచ్చిన అవకాశాల పట్ల కృతజ్ఞుడినై ఉంటానని వివరించారు.
ఉడుపి నుంచి పార్టీ యశ్‌పాల్ సువర్ణను అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీలో యశ్‌పాల్ సువర్ణ అభివృద్ధికి తాను పాటుపడ్డానని భట్ వివరించారు.
