దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ శనివారం నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంలు ... ఉద్ధవ్‌ ఠాక్రే, ఎంకే స్టాలిన్‌, శివరాజ్‌ సింగ్ చౌహన్‌, జైరామ్ ఠాకూర్‌లకు వేర్వేరుగా ఫోన్‌ చేసిన ప్రధాని కొవిడ్‌ పరిస్థితుల గురించి చర్చించారు.   

ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు, తగ్గుతున్న పాజిటివిటీ రేటు గురించి ప్రధానికి వివరించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహన్‌.. మోడీతో ఫోన్‌  అనంతరం ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేసినట్లు చౌహన్ వెల్లడించారు.

Also Read:ఈ చర్యలతో ఇండియా థర్డ్‌ వేవ్‌‌ను జయించవచ్చు: విజయరాఘవన్‌

ప్రధానితో ఫోన్‌లో మాట్లాడినట్లు హిమాచల్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌ కూడా ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక తమకు మరింత ఆక్సిజన్‌ సరఫరా చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

కాగా, మహారాష్ట్రలో శుక్రవారం 54వేల కొత్త కేసులు నమోదవ్వగా.. 898 మంది మరణించారు. ఇక మధ్యప్రదేశ్‌లో నిన్న 11,708, హిమాచల్‌ప్రదేశ్‌లో 4,177 కొత్త కేసులు వెలుగుచూశాయి. తమిళనాడులోనూ కోవిడ్ మహమ్మారి విజృంభణ ఎక్కువగానే ఉంది. అక్కడ తాజాగా 26 వేల పైచిలుకు రోజువారీ కేసులు బయటపడ్డాయి. కరోనా వ్యాప్తి కట్టడి కోసం స్టాలిన్‌ ప్రభుత్వం రెండు వారాల సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించింది.