న్యూఢిల్లీ: రెండోపర్యాయం ఎన్నికైన తరువాత తన తొలి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ భారత రక్షణ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎర్రకోటనుండి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్)ను నియమించనున్నట్టు తెలిపారు. 1999 కార్గిల్ యుద్ధానంతరం తొలిసారి ఈ పోస్టును ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కానీ 20 సంవత్సరాలపాటు రాజకీయ కారణాలవల్ల ఇది సాధ్యపడలేదు. మరి ఇంతకాలం తరువాత ఏర్పాటు చేయబోయే ఈ పోస్టు ఏమిటి? అందులో నియమింపబడే వ్యక్తి బాధ్యతలేంటి? అసలు ఈ పోస్టును సృష్టించడానికి దారితీసిన కారణాలేంటో చూద్దాం. 

కార్గిల్ యుద్ధానంతరం ఏర్పాటైన మంత్రుల కమిటి రక్షణ దళాల్లో మరింత అనుసంధానం పెంచి, మరింత సమర్థవంతంగా తయారుచేయడానికి ఈ పోస్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కార్గిల్ యుద్ధ సమయంలో త్రివిధ దళాలు ధైర్యసాహసాలతో పోరాడినప్పటికీ వారిమధ్య అనుసంధానం సరిగాలేక కొన్ని సందర్భాల్లో సమన్వయ లోపం కనపడింది. ఈ సమస్యను పరిష్కరించడానికే ఈ పోస్టును ఏర్పాటు చేయనున్నారు. 

చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా నియమితులయ్యేవారు భారత ప్రభుత్వానికి రక్షణ విషయాల్లో ఏకైక అధీకృత సలహాదారుగా ఉంటారు. త్రివిధ దళాలకు కూడా ఇతనే చీఫ్ గా వ్యవహరిస్తాడు. 5 స్టార్ మిలిటరీ ఆఫీసర్ స్థాయిని కలిగి ఉంటాడు. త్రివిధ దళాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఒకడే తీసుకుంటాడు. 

1962 చైనా యుద్ధ సమయంలో భారతవాయుసేన సహకారాన్ని ఆర్మీ అడగలేదు. ఒకవేళ అదే సమన్వయంతో గనుక దాడిచేసి ఉంటే, టిబెటన్ పీఠభూమిపైన మోహరించిన చైనా సైన్యం చెల్లాచెదురై ఉండేది. 1965 పాకిస్తాన్ తో యుద్ధ సమయంలో నౌకా దళానికి తాము సరిహద్దు దాటుతున్నామన్న విషయాన్ని కూడా ఆర్మీ తెలుపలేదు. ఈ యుద్ధాల నుంచి అనుభవ పాఠాలు నేర్చుకున్న త్రివిధ దళాలు 1971 బాంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో పూర్తి సమన్వయంతో, సమర్థవంతంగా పనిచేసి13 రోజుల్లోనే యుద్ధాన్ని పూర్తిచేశాయి. 

1971 యుద్ధ సమయంలో కూడా ఇంత సమన్వయానికి కారణం అప్పటి ఆర్మీ చీఫ్ మానిక్ షా. ఆయన మిగిలిన సైనికాధికారులతో తనకు ఉన్న పరిచయాలవల్ల వారిని కూడా తనవెంట నడిచేలా చేసాడు. పూర్తిస్థాయిలో ఇలా సమన్వయాన్ని ఏర్పరిచే వ్యవస్థను మాత్రం రూపొందించలేదు. 

ఇప్పుడు పరిస్థితులు మరింత మారాయి. ఒక పక్క పాకిస్తాన్ మరోపక్క చైనా, ఇలా ఒకే సారి రెండు సరిహద్దుల్లో యుద్ధాన్ని కూడా చేయడానికి త్రివిధ దళాలు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది సాకారమవ్వాలంటే ఒకరి ఆధీనంలోనే త్రివిధ దళాలు ఉండాలి. అప్పుడు మాత్రమే అవసరమైన రీతిలో పరిస్థితులకనుగుణంగా అవసరమైన సేనను వాడవచ్చు. పదాతి దళాలకు అవసరమైనప్పుడు వెంటనే విమానాలను పంపవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే పూర్తి యుద్ధతంత్రాన్ని సమర్థవంతంగా, శత్రువులు ఊహించని విధంగా రచించవచ్చు. 

ఇప్పటికే యుద్ధాల గతి మారుతోంది. సాంప్రదాయ యుద్ధాల స్థానంలో అణు బాంబులు వచ్చాయి. సైబర్ యుద్ధం పేరిట ఇతర దేశాల కంప్యూటర్లను హ్యాక్ చేస్తూ వారి సమాచార సాంకేతిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నారు. అంతరిక్షంలో కూడా శత్రు దేశాల ఉపగ్రహాలను కూల్చి వారి సమాచార వ్యవస్థలను చిన్నాభిన్నం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయం లేకుండా త్రివిధ దళాలు పనిచేయడం కుదరదు. 

2012లో నరేష్ చంద్ర కమిటీ సిఫారసుల ఆధారంగా చీఫ్ అఫ్ స్టాఫ్ కమిటీ అనే ఒక వ్యవస్థ ద్వారా ప్రస్తుతానికి సమన్వయాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు పారికర్ పలుమార్లు  చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పోస్టు ఆవశ్యకతను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ కూడా దీనిపైనా తీవ్రస్థాయిలోనే కృషి చేశారు. 2008నుంచి ఈ పోస్టు ఏర్పాటు ఆవశ్యకతను గూర్చి పలుమార్లు పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ ప్రశ్నపైన అప్పటి రక్షణ మంత్రి ఆంటోని మాట్లాడుతూ రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తున్నామని, అది కుదరగానే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

యుద్ధ సమయాల్లో కీలక నిర్ణయాలను తీసుకోవలిసి వస్తుంది. ఆ నిర్ణయం పూర్తి యుద్ధ గతిని మార్చేది కూడా అయి ఉండొచ్చు. అలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే, త్రివిధ దళాలకు చీఫ్ గా ఉండే ఒక వ్యక్తి మాత్రమే తీసుకోగలడు. అంతే తప్ప ఇలా కమిటీలతో ఏకాభిప్రాయం కుదరడం కష్టం. ఎట్టకేలకు మంత్రుల కమిటీ సూచించిన 20 సంవత్సరాల తరువాత భద్రతా దళాలను మరింత సమన్వయపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

నేడు మోడీ ప్రకటన: 11 ఏళ్లుగా రాజీవ్ చంద్రశేఖర్ కోరుతున్నదే...