73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రక్షణ శాఖ నుంచి ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను నెరవేరుస్తూ.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ను త్వరలో  నియమించబోతున్నట్లు మోడీ ప్రకటించారు.

సైనిక దళాల మధ్య సమన్వయంతో పాటు ప్రణాళికలు, శిక్షణ, బడ్జెటింగ్ ఇలా అన్నింటిని సీడీఎస్ సమన్వయం చేస్తారు. ఇటు త్రివిధ దళాల అధిపతులు తమ విధులపై పూర్తి స్ధాయిలో దృష్టి పెట్టనున్నారు.

ఈ సీడీఎస్‌ను త్రివిధ దళాల్లోని ఏదో ఒక విభాగం నుంచి ఎన్నుకునే అవకాశం వుంది. మూడు దళాల్లోని సీనియర్ అధికారిని సీడీఎస్‌గా నియమించనున్నారు. ఇక సీడీఎస్ ప్రస్తావన ఇప్పటిది కాదు.. 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత ఏర్పాటైన కె. సుబ్రమణ్యం కమిటీ తొలిసారి సీడీఎస్ నియామకం గురించి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 

కానీ నాటి ప్రభుత్వాలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ వ్యవహారంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ 2006లోనే నాటి రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీని లిఖిత పూర్వకంగా ప్రశ్నించారు.

కార్గిల్ కమిటీ సిఫారసులలోని అతి ముఖ్యమైన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం ఏమైందని..దీనిపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటని చంద్రశేఖర్ ప్రశ్నించారు. దీనికి 2008 మార్చి 5న సమాధానం చెప్పారు.

దేశ రక్షణ వ్యవస్థలో సంస్కరణలపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 2001లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని.. అందులో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గురించి ప్రధానంగా తెలిపారని ఆంటోనీ ప్రస్తావించారు.

కమిటీ సిఫారసులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని అయితే సీడీఎస్ నియామకంపై ప్రధాన పార్టీల అభిప్రాయాన్ని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా మార్చి 2006లో రక్షణ మంత్రి అన్ని జాతీయ పార్టీల అధ్యక్షులకు లేఖ రాసినట్లు ఆంటోనీ వెల్లడించారు.

అయితే కేవలం ఐదు పార్టీలు మాత్రమే సీడీఎస్ నియామకం గురించి అభిప్రాయాన్ని చెప్పాయని రాజీవ్ చంద్రశేఖర్‌కు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

మోడీ కీలక ప్రకటన: సిడీఎస్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తాడు?