Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌పై ఆజాద్ మరో దాడి.. రాహుల్‌పై ఘాటు వ్యాఖ్యలు.. ‘మోడీ ఒక సాకు.. ఆ లేఖ రాసినప్పటి నుంచే అసంతృప్తి’

గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీపై మరోసారి దాడి చేశారు. తనను విమర్శించడానికి కాంగ్రెస్‌కు మోడీ ఒక సాకు మాత్రమే అని అన్నారు. నిజానికి మోడీని హగ్ చేసుకున్నది తాను కాదని, రాహుల్ గాంధీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 

modi an excuse.. not me but rahul gandhi who entagled with him first ghulam nabi azad slams congress
Author
First Published Aug 29, 2022, 1:47 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రోజుల వ్యవధిలోనే గులాం నబీ ఆజాద్ మరో సారి ఆ పార్టీపై మాటలతో దాడి చేశారు. రాహుల్ గాంధీపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీ 23 నుంచి తాము లేఖ రాశామని, అప్పటి నుంచే తనపై కాంగ్రెస్ అసంతృప్తి ప్రదర్శించిందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రస్తావన కేవలం ఒక సాకు మాత్రమేనని పేర్కొన్నారు.

జీ 23లో తన పాత్రను కాంగ్రెస్ జీర్ణించుకోలేదని, అప్పటి నుంచే తనను టార్గెట్ చేశారని గులాం నబీ ఆజాద్ తెలిపారు. కాంగ్రెస్‌లోని కేవలం సైకోఫాంట్లు మాత్రమే తనను టార్గెట్ చేస్తున్నారని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనతో క్లోజ్‌గా ఉన్నారని, ఇద్దరికీ లోపాయికారిగా సంబంధం ఉన్నదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తాను మోడీ పంచన చేరుతున్నట్టు కల్పిత కథలు అల్లుతున్నారని తెలిపారు. నిజానికి ప్రధాని మోడీతో కలిసిపోయింది తాను కాదని.. రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రధాని మోడీని కౌగిలించుకున్నది ఎవరు అని ప్రశ్నించారు. అందుకే మోడీని కౌగిలించుకున్నది తాను కాదని, రాహుల్ గాంధీ అని అన్నారు.

పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా గతంలో రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ దగ్గరకు వెళ్లి ఆయనను హత్తుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ గందరగోళం చెలరేగింది. రాహుల్ గాంధీ తీరును సమర్థించాలా? లేదా? అనే సంశయంలో పడిపోయారు. తాము కేవలం వారి విధానాలను విమర్శిస్తున్నామని, తమ మనసు నిర్మలమైనదని చెప్పడంలో భాగంగా రాహుల్ గాంధీ.. మోడీని కౌగిలించుకున్నారు.

కాంగ్రెస్ నాయకత్వం ఎప్పుడూ వారికి ఎవరూ ఇలా లేఖలు రాయాలని కోరుకోదని, వారిని ప్రశ్నించాలని అస్సలు కోరుకోదని గులాం నబీ ఆజాద్ అన్నారు. ఎన్నో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరిగాయని, కానీ, తాము చేసిన సూచనల్లో ఒక్కదానినీ తీసుకోలేదని విమర్శించారు.

సుమారు రెండేళ్ల క్రితం గులాం నబీ ఆజాద్, మనీష్ తివారీ, కపిల్ సిబల్, జితిన్ ప్రసాదా.. సహా మొత్తం 23 మంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి రెబల్ లెటర్ రాశారు. కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉన్నదని, వెంటనే సమూల ప్రక్షాళన చేయాలని సూచించారు. పూర్తిస్థాయి నాయకత్వాన్ని పారదర్శకంగా ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ గ్రూప్ నుంచి ఇప్పటి వరకు నలుగురు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టారు. కపిల్ సిబల్, జితిన్ ప్రసాదా, యోగానంద్ శాస్త్రిలతోపాటు తాజాగా, నాలుగో రెబల్ గులాం నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios