బిహార్‌లో కొందరు దొంగలు పట్టపగలే మొబైల్ టవర్‌ను మాయం చేశారు. ఆ సెల్ టవర్ పని చేయడం లేదని, అందుకే దాన్ని తొలగిస్తున్నామని, ఆ కంపెనీ అధికారులుగా వారు స్థానికులను నమ్మించి చోరీ చేశారు. ముజ‌ఫర్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 

పాట్నా: బిహార్‌లో దొంగలు ఊహకు అందని రీతిలో చోరీలకు పాల్పడుతున్నారు. ఒక ప్రొఫెషనల్ వేలో వారు చోరీలు చేస్తున్నారు. పట్టపగలు.. బహిరంగంగా అందరూ చూస్తుండగానే ఈ దొంగతనాలు జరగడం చర్చనీయాంశం అవుతున్నది. ఐరన్ బ్రిడ్జీని కూల్చేసి కాజేయడం, ట్రైన్ బోగీలనూ మాయం చేయడం వంటి నమ్మలేని అపహరణలు బిహార్‌లో జరిగాయి. తాజాగా, అదే కోవలోకి వెళ్లే ఘటన జరిగింది. ఓ దొంగల ముఠా ముజఫర్‌పూర్‌లో పట్టపగలే ఏకంగా సెల్ టవర్‌ను కాజేశారు.

ముజఫర్‌పూర్‌లో సదర్ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రమజీవి నగర్ ఏరియాలో జీటీఏఎల్ కంపెనీ ఓ మొబైల్ టవర్ ఏర్పాటు చేసింది. మనీషా కుమారి ఇంటిలో ఈ టవర్ ఏర్పాటు చేసింది. ఈ టవర్ ఇన్‌స్పెక్షన్ కోసం ఇటీవలే అధికారులు మనీషా కుమారి ఇంటికి చేరి ఖంగుతిన్నారు. అక్కడ వారు ఏర్పాటు చేసిన టవర్ కనిపించలేదు. 

కంపెనీ అధికారి షానవాజ్ అన్వర్ సదర్ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తులో మనీషా కుమారి కీలక విషయాలు వెల్లడించింది. 

కొందరు వ్యక్తులు జీటీఏఎల్ కంపె నీ అధికారులను పేర్కొంటూ కొన్ని నెలల క్రితం అక్కడకు వచ్చారని, ఆ టవర్ పని చేయడం లేదని, కాబట్టి, దాన్ని తొలగిస్తున్నట్టు తమకు చెప్పారని వివరించింది. ఆ టవర్‌ను పట్టపగలు నాలుగు గంటలు పని చేసి విడి భాగాలు విప్పారు. వెంట తెచ్చుకున్న ట్రక్కులో వాటిని లోడ్ చేసుకున్నారు. టవర్‌తోపాటు అక్కడ ఉంచిన జనరేటర్, స్టెబిలైజర్, మరికొన్ని వస్తువులు కూడా చోరీకి గురయ్యాయి.

Also Read: Atiq Ahmed: అతీక్ హత్యపై అసదుద్దీన్ ఒవైసీ స్పందన.. జై శ్రీరాం నినాదాలు ఇచ్చారు..కోర్టులు, న్యాయవ్యవస్థ ఎందుకు?

ఈ ఎక్విప్‌మెంట్ విలువ సుమారు రూ. 4.5 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

బిహార్‌లో ఇలా మొబైల్ టవర్‌ను చోరీ చేయడం ఇది రెండోసారి. పాట్నాలోని సబ్జీ బాగ్ ఏరియా నుంచీ ఇదే రీతిలో మొబైల్ టవర్‌ను అపహరించారు.