దేశంలో అత్యాచారాలకు కారణం సెల్‌ఫోన్‌లేనంటూ గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలు సరిగా లేవని పోలీసులను నిందిస్తామని, కానీ ప్రతిసారి వారిని నిందించలేమని ఆయన అన్నారు.
గుజరాత్ హోంమంత్రి (gujarat home minister) హర్ష్ సంఘ్వీ (harsh sanghvi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మొబైల్ ఫోన్ల (cell phones) కారణంగానే దేశంలో అత్యాచారాలు (rapes) భారీగా పెరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మొబైల్ ఫోన్‌లోకి అశ్లీల వీడియోలు సులభంగా వచ్చేస్తున్నాయని.. ఇవి కొందరిలో దుర్బుద్ధిని రేపుతున్నాయని సంఘ్వీ పేర్కొన్నారు. అంతేకాదు భారత్‌లో అత్యాచారాలు భారీగా పెరిగిపోవడానికి ఇతర కారణాలను కూడా ఆయన వివరించారు. తెలిసిన వ్యక్తులైన పొరుగిళ్లల్లో ఉండేవారు, కుటుంబ సభ్యులు సైతం ఇలాంటి నేరాలకు పాల్పడుతుండటం మరో ముఖ్య కారణంగా హర్ష్ సంఘవి వివరించారు. ఈ తరహా ఘటనలు ముఖ్యంగా చిన్నపిల్లలపై జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
మనదేశంలో అత్యాచారాలు ఎక్కువగా జరగడానికి మొబైల్ ఫోన్లు, తెలిసిన వ్యక్తులే కారణమని, ఇటీవలి సర్వేలో తేలినట్లు హర్ష్ సంఘ్వీ స్పష్టం చేశారు. అత్యాచారాలు సమాజానికి మాయని మచ్చగా నిలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు శాంతి భద్రతలు సరిగా లేవని పోలీసులను నిందిస్తామని, కానీ ప్రతిసారి వారిని నిందించలేమని మంత్రి చెప్పారు. కుమార్తెపై ఓ తండ్రి అఘాయిత్యానికి పాల్పడితే.. తప్పు పోలీసులది కాదు. ఇందుకు కారణం ఆ తండ్రి చేతిలోని సెల్‌ఫోన్’ అని హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
