మన ఫోన్ నెంబర్ మారకుండా.. కేవలం నెట్ వర్క్ మార్చుకోవడానికి ఇప్పటివరకు మనం పోర్ట్ పెట్టుకునే వాళ్లం. అదేనండి.. నెంబర్ పోర్టబులిటి. ఒక నెట్ వర్క్ నచ్చకపోతే.. మరో నెట్ వర్క్ కి సులభంగా జంప్ అయిపోతున్నాం. ఎన్ని నెట్ వర్క్ లు మారిన మన ఫోన్ నెంబర్ మాత్రం మారకుండా అదే కొనసాగించేవాళ్లం. అయితే.. భవిష్యత్తులో ఈ అవకాశం మనకు ఉండకపోవచ్చు. 

దేశంలో మొబైల్‌ నెంబర్‌ పోర్టబులిటీ సేవలను అందిస్తున్న ఇంటర్ కనెక్షన్ టెలికాం సొల్యూషన్స్, సినివెర్స్ టెక్నాలజీస్ సంస్థలు ఎంఎన్‌పీ సేవలను 2019 మార్చి నుంచి నిలిపివేయనున్నాయని ఎకనామిక్‌ టైమ్స్‌ రిపోర్టు చేసింది. పోర్టింగ్‌ ఛార్జీలను భారీ ఎత్తున్న తగ్గించడంతో, ఈ సర్వీసులను నిలిపివేయనున్నామని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌(డీఓటీ)కి ఈ కంపెనీలు లేఖ రాసినట్టు రిపోర్టు పేర్కొంది. ఒకవేళ ఈ కంపెనీలు అన్నట్టుగానే సర్వీసులను నిలిపివేస్తే... వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు మారడం ఇక అంత సులువు కాదు.  

ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఎంఎన్‌పీ ఫీజులను టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్‌ 19 రూపాయల నుంచి 4 రూపాయల వరకు అంటే 80 శాతం మేర తగ్గించింది. అప్పటి నుంచి తాము నష్టాలను చవిచూస్తున్నామని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి తమ లైసెన్స్ ముగియగానే ఎంఎన్‌పీ సేవలు నిలిపివేస్తామని డీఓటీకి తాజాగా రాసిన లేఖలో ఈ రెండు కంపెనీలు పేర్కొన్నాయని రిపోర్టు వెల్లడించింది. మొబైల్‌ నెంబర్‌ పోర్టబులిటీ ద్వారా కేవలం ఒకే లైసెన్స్‌ సర్వీసు ఏరియాలో మాత్రమే కాక, ప్యాన్‌ ఇండియా నెట్‌వర్క్‌ను మార్చుకోవచ్చు. మరోవైపు ఈ సర్వీసులను కొనసాగించడానికి మరో కొత్త సర్వీసు కంపెనీలకు లైసెన్స్‌ ఇచ్చే అవకాశాలున్నాయని టెలికాం వర్గాలంటున్నాయి.