బంగ్లాదేశ్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. మరోసారి హిందూ ఆలయం లక్ష్యంగా దాడి జరిగింది. సుమారు 200 మందితో కూడిన ఓ మూక ఇస్కాన్ టెంపుల్‌పై గురువారం దాడి చేసింది. ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా.. దోపిడీకి తెగబడ్డట్టు సమాచారం.
న్యూఢిల్లీ: బంగ్లదేశ్‌లో మరోసారి మత ఉన్మాదం రగిలినట్టు తెలుస్తున్నది. సుమారు 200 మందితో కూడిన ఓ మూక హిందూ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నది. మూకుమ్మడిగా ఆ ఆలయంపై పడి విధ్వంసం చేశారు. దోపిడీ చేశారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు హిందువులు గాయపడ్డారు. బంగ్లాదేశ్ రాజధని ఢాకాలో వారిలోని 222 లాల్ మోహన్ సాహా వీధిలో ఇస్కాన్ రాధాకంట ఆలయం ఉన్నది. ఈ ఆలయంపైనే గురువారం మూక దాడి జరిగింది.
హాజీ షఫీఉల్లాహ్ సారథ్యంలో ఈ మూక దాడి జరిగినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి. కాగా, ఈ దాడిలో సుమంత్ర చంద్ర శ్రవణ్, నిహర్ హల్దర్, రాజీవ్ భద్ర సహా పలువురు దాడికి గురైనట్టు సమాచారం.
గతేడాది కూడా హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగిన సంగతి తెలిసిందే. కొమిల్లా టౌన్‌లో ననౌర్ దిఘీ సరస్సు సమీపంలోని దుర్గా మాత పూజా మంటపంలో ముస్లిం పవిత్ర గ్రంథం ఖురాన్‌ను అవమానించినట్టు సోషల్ మీడియాలో అప్పుడు వార్తలు వ్యాపించగానే.. కొందరు హిందూ ఆలయాలు, హిందువుల నివాసాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. అప్పుడు సుమారు ముగ్గురు వ్యక్తులు మరణించారు.
అప్పుడు కనీసం 70 హిందువుల ఇళ్లపై దాడి జరిగింది. ఈ ఘటన బంగ్లాదేశ్ సహా Indiaలోనూ కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలను ప్రేరేపించేలా ఫేస్‌బుక్ పోస్టు చేసినట్టు.. లౌడ్‌స్పీకర్‌లలో రెచ్చగొట్టేలా మాట్లాడినట్టు ఇద్దరు నిందితులు కోర్టు ముందు ఒప్పుకున్నారు. షైకత్ మండల్, రబియుల్ ఇస్లాం అనే ఇద్దరు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించారు. రంగ్‌పూర్‌లో సీనియర్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ డెల్వర్ హొస్సెయిన్ ముందు షైకత్ మండల్, రబియుల్ ఇస్లాంలు తమ నేరాన్ని అంగీకరించారని ఓ కోర్టు అధికారి వెల్లడించారు.
రంగ్‌పూర్ సబ్ డిస్ట్రిక్ట్ పిర్‌గంజ్‌లోని కాలేజీలో మండల్ ఫిలాసఫీ స్టూడెంట్. ఈ కేసులో అరెస్టు కాగానే అధికారంలోని అవామీ లీగ్ స్టూడెంట్ వింగ్ ఛాత్రా లీగ్ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి బహిష్కరించింది. రంగ్‌పూర్‌లో దుర్గా పూజా వేడుకల సమయంలో అక్టోబర్ 17న హింసకు తాను చేసిన ఫేస్‌బుక్ పోస్టు కూడా కారణమని మండల్ కోర్టుకు తెలియజేశారు. మండల్ తన ఫాలోవర్లను పెంచుకోవడానికి అసభ్యకరమైన కంటెంట్‌ను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినట్టు ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ అధికారి ఒకరు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు.
బంగ్లాదేశ్‌లో దుర్గా పూజా వేడుకలు జరుగుతుండగా కొందరు ఉన్మాదులు హిందు మైనార్టీల పై దాడులకు తెగబడ్డారు. వారి ఇళ్లపైనా దాడులు జరిపారు. వీటిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా మైనార్టీలు ఆందోళనలు చేశారు. ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా ఈ దాడులను ఖండిస్తూ స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ దాడులకు పాల్పడ్డ వారిని కచ్చితంగా పట్టుకుని తీరుతామని హామీనిచ్చారు. సోషల్ మీడియా పోస్టులను ప్రజలు గుడ్డిగా నమ్మవద్దని, వాటి నిజానిజాలను నిర్దారణ చేసుకున్న తర్వాతే ఒక అభిప్రాయానికి రావాలని సూచించారు.
